శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 21, 2020 , 01:43:04

సూపర్‌ థ్రిల్లర్‌

సూపర్‌ థ్రిల్లర్‌

  • పంజాబ్‌పై ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు.. మయాంక్‌ శ్రమ వృథా

చాన్నాళ్లుగా క్రికెట్‌ మజాకు ముఖం వాచిపోయి ఉన్న అభిమానులకు ఆదివారం విందు భోజనం లభించినైట్లెంది. ఆధి క్యం చేతులు మారుతూ సాగిన పోరు లో చివరకు స్కోర్లు సమంకాగా.. సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఢిల్లీ తరఫున రబాడ దు మ్మురేపి రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. స్వల్ప లక్ష్యాన్ని అయ్యర్‌ సేన సునాయా సంగా ఛేదించింది. అంతకుముందు అసలు పోరులో ఓటమి ఖాయమనుకున్న పంజాబ్‌ను మయాంక్‌ అగర్వాల్‌ ఆదుకున్నాడు. సహచరులంతా ఒకరివెంట ఒకరు వెనుదిరుగుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ మ్యాచ్‌ను టై చేశాడు. 20 బంతుల్లో అర్ధశతకం చేసిన స్టొయినిస్‌ కష్టం వృథా కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి విజయాన్ని ఒడిసిపట్టింది. 

దుబాయ్‌: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా దాదపు ఆరు నెలలుగా క్రికెట్‌ సందడిలేక మూగబోయిన టెలివిజన్లు ఆదివారం దద్దరిల్లాయి. ఐపీఎల్‌ 13వ సీజన్‌ రెండో మ్యాచ్‌లోనే సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేలడంతో.. లీగ్‌ నిర్వాహకులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, అభిమానులు ఫుల్‌ జోష్‌లో మునిగిపోయారు. కన్నడిగులతో నిండి ఉన్న పంజాబ్‌ జట్టుకు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దేశవాళీ ఆటగాళ్లతో దట్టించి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ షాకిచ్చింది. టాస్‌ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌  అయ్యర్‌ (39; 3 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లలో షమీ (3/15), కాట్రెల్‌ (2/24) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ అగర్వాల్‌ (60 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోవడంతో.. నిర్ణీత ఓవర్లలో పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 157 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యం కాగా.. అందులో రబాడ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ విజయం సాధించింది. స్టోయినిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’ దక్కింది. 

తడబడి.. నిలబడి..

ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభంలో చూసిన వారు ఆ మాత్రం స్కోరు చేయగలదని భావించి ఉండరు. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడ్డ క్యాపిటల్స్‌ను అయ్యర్‌, పంత్‌ ఆదుకోగా.. ఆ తర్వాత స్టోయినిస్‌ స్కోరుకు రాకెట్‌ వేగాన్నిచ్చాడు. రహానేను పక్కనపెట్టి ఓపెనర్లుగా దిగిన ధావన్‌ (0), పృథ్వీ షా (5) పూర్తిగా విఫలం కాగా.. హెట్‌మైర్‌ (7) ఆకట్టుకోలేకపోయాడు. నిలదొక్కుకున్నట్లు కనిపించిన అయ్యర్‌, పంత్‌ కూడా ఔట్‌ కావడంతో ఢిల్లీ కథ ముగిసినట్లే అనుకున్నారంతా.. ఈ దశలో స్టొయినిస్‌ వీరబాదుడు బాదడంతో క్యాపిటల్స్‌ చివరి మూడు ఓవర్లలో 57 పరుగులు పిండుకుంది. ఈ క్రమంలో స్టొయినిస్‌ 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోవడం విశేషం.  

అదే బాటలో..

టార్గెట్‌ ఛేజింగ్‌ల పంజాబ్‌కు కూడా శుభారంభం దక్కలేదు. 35 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ రాహుల్‌ (21), కరుణ్‌ నాయర్‌ (1), నికోలస్‌ పూరన్‌ (0), మ్యాక్స్‌వెల్‌ (1) విఫలమయ్యారు. సర్ఫరాజ్‌ (12), గౌతమ్‌ (20) సాయంతో మయాంక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక దశలో సాధించాల్సిన రన్‌రేట్‌ ఆకాశాన్నంటినా.. మయాంక్‌ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. స్కోరు సమం చేసిన అనంతరం చివరి ఓవర్‌ ఐదో బంతికి అగర్వాల్‌ ఔట్‌ కావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరగా.. ఆఖరి బంతికి జోర్డన్‌ (5) క్యాచ్‌ ఔట్‌ అవడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.


స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) జోర్డన్‌ (బి) షమీ 5, ధావన్‌ (రనౌట్‌) 0, హెట్‌మైర్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 7, అయ్యర్‌ (సి) జోర్డన్‌ (బి) షమీ 39, పంత్‌ (బి) రవి 31, స్టోయినిస్‌ (రనౌట్‌) 53, అక్షర్‌ (సి) రాహుల్‌ (బి) కాట్రెల్‌ 6, అశ్విన్‌ (సి) షమీ (బి) కాట్రెల్‌ 4, రబాడ (నాటౌట్‌) 0, నోర్జే (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 157/8. వికెట్ల పతనం: 1-6, 2-9, 3-13, 4-86, 5-87, 6-96, 7-127, 8-154, బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-24-2, షమీ 4-0-15-3, జోర్డన్‌ 4-0-56-0, గౌతమ్‌ 4-0-39-0, రవి 4-0-22-1,    

పంజాబ్‌: రాహుల్‌ (బి) మోహిత్‌ 21, మయాంక్‌ (సి) హెట్‌మైర్‌ (బి) స్టొయినిస్‌ 89, కరుణ్‌ (సి) పృథ్వీ (బి) అశ్విన్‌ 1, పూరన్‌ (బి) అశ్విన్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) అయ్యర్‌ (బి) రబాడ 1, సర్ఫరాజ్‌ (సి) పృథ్వీ (బి) అక్షర్‌ 12, గౌతమ్‌ (సి) పంత్‌ (బి) రబాడ 20, జోర్డన్‌ (సి) రబాడ (బి) స్టొయినిస్‌ 5, షమీ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 157/8. వికెట్ల పతనం: 1-30, 2-33, 3-34, 4-35, 5-55, 6-101, 7-157, 8-157, బౌలింగ్‌: నోర్జె 4-0-33-0, మోహిత్‌ 4-0-45-1, రబాడ 4-0-28-2, అశ్విన్‌ 1-0-2-2, అక్షర్‌ 4-0-14-1, స్టొయినిస్‌ 3-0-29-2. logo