బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 00:34:30

ఆసీస్‌ చేజేతులా..

ఆసీస్‌ చేజేతులా..
  • దక్షిణాఫ్రికా చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిన కంగారూలు

పోర్ట్‌ ఎలిజబెత్‌: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవి చూసిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోరులో తొలుత తక్కువ పరుగులే చేసినా.. బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని కట్టడి చేయడంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లక్ష్యఛేదనలో చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న ఆసీస్‌ 28 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో సఫారీ పేసర్లు ఎంగ్డీ (3/41), రబడ (1/27) విజృంభించడంతో కంగారూ జట్టు లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (56 బంతుల్లో 67 నాటౌట్‌; 5 ఫోర్లు, ఒక సిక్స్‌) క్రీజులో ఉన్నా ఫలితం లేకపోయింది. 


మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది.  కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ (47 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. డసెన్‌ (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో రిచర్డ్‌సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం టార్గెట్‌ ఛేజింగ్‌లో ఒక దశలో 124/2తో పటిష్ఠంగా కనిపించిన ఆసీస్‌.. ఆ తర్వాత సఫారీ పేసర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న వార్నర్‌ క్రీజులో ఉన్నా.. ప్రొటీస్‌ బౌలర్లు అతడికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుం డి నడిపించిన డికాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.


logo