సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 18:25:41

IPL 2020: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు పంత్‌ దూరం!

IPL 2020: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు పంత్‌ దూరం!

దుబాయ్:  ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో  మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది.  ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌  జట్లు  బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో  46 పరుగుల తేడాతో  రాజస్థాన్‌ను ఢిల్లీ చిత్తుగా ఓడించింది.   ఈ నేపథ్యంలో ఢిల్లీని మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్‌ భావిస్తోంది.  స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ బ్యాటు, బంతితో చెలరేగాలని ఆ జట్టు ఆశిస్తోంది. సీజన్‌‌  ఆరంభంలో  అదరగొట్టిన  స్టీవ్‌ స్మిత్‌‌, సంజూ శాంసన్‌‌ వరుసగా విఫలమవుతున్నారు. వీరిద్దరూ సత్తాచాటితే ఢిల్లీకి కష్టాలు తప్పవు. 

అలాగే రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది.  తొడకండరాల నొప్పితో  ముంబై ఇండియన్స్‌తో    మ్యాచ్‌కు దూరమైన ఢిల్లీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ రాజస్థాన్‌తో  పోరుకు అందుబాటులో ఉండట్లేదని  సమాచారం. అతడు కోలుకోవడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉన్నది.  పంత్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.  ముంబైతో మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బాటపట్టాలని పట్టుదలతో  ఉన్నది.   ఢిల్లీ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.