మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 15, 2020 , 01:33:25

ఇద్దరే కొట్టేశారు

ఇద్దరే కొట్టేశారు

సమఉజ్జీల సమరంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. తొలుత ఫ్లాట్‌ పిచ్‌పై పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ మనవాళ్లు.. ఆ తర్వాత బౌలింగ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసి చెమటోడ్చి సాధించిన స్కోరును ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ ఇద్దరే దంచి కొట్టారు. వీరిద్దరి వీరబాదుడుకు మరో 74 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ విజయ పతాక ఎగురవేసింది.

  • శతకాలతో విజృంభించిన వార్నర్‌, ఫించ్‌
  • పది వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో భారత్‌ పరాజయం

ముంబై: ఇటీవలి కాలంలో సొంతగడ్డపై వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి వన్డేలోనే విరాట్‌ సేనకు భారీ షాక్‌ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖడేలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడింది. ఓపెనర్లు వార్నర్‌ (112 బంతుల్లో 128 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫించ్‌ (114 బంతుల్లో 110 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో ఆసీస్‌ వికెట్‌ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. శిఖర్‌ ధవన్‌ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో సత్తాచాటగా.. లోకేశ్‌ రాహుల్‌ (47) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌.. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ శతక్కొట్టడంతో.. 37.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 258 పరుగులు చేసింది. వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.


మిడిల్‌ వైఫల్యం

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (10) త్వరగానే ఔటైనా ధవన్‌, రాహుల్‌ సాధికారికంగా ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఆ తర్వాత గేరు మార్చిన ధవన్‌ తనదైన స్టయిల్లో దూకుడు పెంచి 66 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. మరో ఎండ్‌లో హాఫ్‌ సెంచరీకి చేరువైన రాహుల్‌ అగర్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ముగ్గురు ఓపెనర్లకు తుదిజట్టులో చోటు కల్పించేందుకు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ కోహ్లీ (12) జంపా బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ధవన్‌ను కమిన్స్‌ వెనక్కిపంపగా.... శ్రేయాస్‌ అయ్యర్‌(4) కూడా ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఓ దశలో 133/1తో పటిష్ఠంగా కనిపించిన టీమ్‌ఇండియా.. 165/4తో కష్టాల్లో పడింది. పంత్‌ (28), జడేజా (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.  


ఆకాశమే హద్దుగా.. 

బ్యాటింగ్‌ పిచ్‌పై మోస్తరు స్కోరును ఛేదించేందుకు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు  వార్నర్‌, ఫించ్‌ భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ మనవాళ్లకు చుక్కలు చూపించారు. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి జట్లపై పోటీపడి వికెట్లు తీసిన భారత బౌలర్లు.. కంగారూలకు కళ్లెం వేయడంలో విఫలమయ్యారు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కమిన్స్‌ బౌన్సర్‌ హెల్మెట్‌కు తగలడంతో గాయపడ్డ పంత్‌ ఫీల్డింగ్‌కు రాకపోగా.. అతడి స్థానం లో రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్‌లో అతడికి బదులుగా మనీశ్‌ పాండే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. పంత్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ తెలిపింది.


1 వన్డే చరిత్రలో ఆస్ట్రేలియాపై  టీమ్‌ఇండియాకు ఇదే తొలి 10 వికెట్ల పరాజయం.


స్కోరు బోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 10, ధవన్‌ (సి) అగర్‌ (బి) కమిన్స్‌ 74, రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) అగర్‌ 47, కోహ్లీ (సి అండ్‌ బి) జంపా 16, అయ్యర్‌ (సి) కారీ (బి) స్టార్క్‌ 4, పంత్‌ (సి) టర్నర్‌ (బి) కమిన్స్‌ 28, జడేజా (సి) కారీ (బి) రిచర్డ్‌సన్‌ 25, శార్దూల్‌ (బి) స్టార్క్‌ 13, షమీ (సి) కారీ (బి) రిచర్డ్‌సన్‌ 10, కుల్దీప్‌ (రనౌట్‌/స్మిత్‌) 17, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 49.1 ఓవర్లలో 255 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-13, 2-134, 3-140, 4-156, 5-164, 6-213, 7-217, 8-229, 9-255, 10-255, బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-56-3, కమిన్స్‌ 10-1-44-2, రిచర్డ్‌సన్‌ 9.1-0-43-2, జంపా 10-0-53-1, అగర్‌ 10-1-56-1.

ఆస్ట్రేలియా: వార్నర్‌ (నాటౌట్‌) 128, ఫించ్‌ (నాటౌట్‌) 110, ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం 37.4 ఓవర్లలో 258/0. బౌలింగ్‌: షమీ 7.4-0-58-0, బుమ్రా 7-0-50-0, శార్దూల్‌ 5-0-43-0, యాదవ్‌ 10-0-55-0, జడేజా 8-0-41-0.
logo
>>>>>>