గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 20:16:57

పున‌రాగ‌మ‌నంపై సామీ దృష్టి

పున‌రాగ‌మ‌నంపై సామీ దృష్టికింగ్‌స్ట‌న్‌:  వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌, స్టార్ ఆల్‌రౌండ‌ర్ డారెన్ సామీ తిరిగి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాను కెరీర్‌కు వీడ్కోలు ప‌లుక‌లేద‌ని.. ఇటీవ‌ల క‌రీబియ‌న్ లీగ్‌లోనూ మంచి ప్ర‌దర్శ‌న చేశాన‌ని దీని ఆధారంగానే వ‌చ్చే ఏడాది భార‌త్‌లో జ‌రుగనున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు. 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విండీస్ కెప్టెన్‌గా పాల్గొన్న సామీ.. ఆ త‌ర్వాత జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఫైన‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్ర‌పంచ చాంప‌య‌న్‌గా నిలిచిన విండీస్ ఆ త‌ర్వాత‌.. బోర్డుతో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను త‌ప్పించింది. 

అయితే ఇన్నాళ్ల త‌ర్వాత సామీ తాజాగా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. శ‌నివారం ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. `నేను ఇంకా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌లేదు. తిరిగి అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడాల‌నుకుంటున్నా. త‌లుపులు మూసుకోలేదు. క‌రీబియ‌న్ లీగ్ చ‌క్కటి ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచా. 2021లో భార‌త్‌లో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం సెలెక్ట‌ర్లు న‌న్ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ని భావిస్తున్నా` అని అన్నాడు. 36 ఏండ్ల సామీ ఇటీవ‌ల వ‌ర్ణ వివ‌క్ష‌పై గ‌ళం విప్పిన విష‌యం తెలిసిందే.


logo