ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 02:40:17

థీమ్‌ X మద్వెదెవ్‌

థీమ్‌ X మద్వెదెవ్‌

  • సెమీస్‌లో తలపడనున్న యువ స్టార్లు.. క్వార్టర్స్‌లో అజెరంకా, సెరెనా గెలుపు.. యూఎస్‌ ఓపెన్‌ 

న్యూయార్క్‌: తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న డొమెనిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), డానిల్‌ మద్వెదెవ్‌ (రష్యా) యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ సమరానికి సిద్ధమయ్యారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన మద్వెదెవ్‌.. ఈసారి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా సెమీస్‌ చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో మూడో సీడ్‌ మద్వెదెవ్‌ 7-6 (8/6), 6-3, 7-6 (7/5)తో తన దేశానికే చెందిన పదో సీడ్‌ ఆండ్రీ రుబ్లేవ్‌పై గెలిచాడు. మ్యాచ్‌ మొత్తం మీద 16 ఏస్‌లతో అదరగొట్టిన డానిల్‌.. 51 విన్నర్లు బాదాడు. కాగా క్వార్టర్స్‌లో థీమ్‌ 6-1, 6-2, 6-4తో అలెక్స్‌ డి మినుర్‌ (ఆస్ట్రేలియా)పై అలవోకగా విజయం సాధించాడు. కాగా యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్‌ నిలిచాడు. మరో సెమీఫైనల్‌లో అలెగ్జాండర్‌  జ్వెరెవ్‌, కరెరో బుస్టా తలపడనున్నారు. 

అజెరంకాతో సెరెనా ఢీ

మహిళల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డు (మార్గరేట్‌ 24)పై కన్నేసిన అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ సెమీఫైనల్‌లో అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి విక్టోరియా అజెరంకా (బెలారస్‌)తో తలపడనుంది. క్వార్టర్స్‌లో అజెరంకా 6-1, 6-0తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 16వ సీడ్‌ ఎలీసీ మర్టెన్స్‌ (బెల్జియం)కు భారీ షాకిచ్చింది. అంతకుముందు మూడో సీడ్‌  సెరెనా 4-6, 6-3, 6-2తో అన్‌సీడెడ్‌ స్వెతానా పిరన్‌కోవా (బల్గేరియా)పై గెలిచింది. తొలి సెట్‌ కోల్పోయి ఒత్తిడిలో పడినా ఆ తర్వాత సెరెనా అదరగొట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది.  మరో సెమీస్‌లో జెన్నీబర్‌ బ్రాడ్లీని నవోమీ ఒసాక ఎదుర్కోనుంది. 


logo