e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home స్పోర్ట్స్ మెద్వెదెవ్‌ మెరిసె..

మెద్వెదెవ్‌ మెరిసె..

  • రష్యా టెన్నిస్‌ స్టార్‌కు తొలి గ్రాండ్‌స్లామ్‌
  • యూఎస్‌ ఓపెన్‌ కైవసం
  • ఫైనల్‌లో జొకోవిచ్‌ ఓటమి

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ చేజిక్కించుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కడంతో పాటు.. క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ తన పేరిట రాసుకోవాలనే లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ బరిలో దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. బిగ్‌ ఫైట్‌లో చురుకైన ఆట, పదునైన ఆలోచనతో జొకోను చిత్తు చేసిన డానిల్‌ మెద్వెదెవ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తున్న మెద్వెదెవ్‌.. ఫైనల్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభిస్తే.. చిరకాల స్వప్నం దూరమవడంతో అసహనానికి గురైన జొకో..రాకెట్‌ను నేలకేసి కొట్టి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు!

న్యూయార్క్‌: ఐదు దశాబ్దాల తర్వాత క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన ఆటగాడిగా చరిత్రకెక్కాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కల నెరవేరలేదు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి.. హార్డ్‌ కోర్ట్‌, గ్రాస్‌ కోర్ట్‌, క్లే (మట్టి) కోర్టు అనే తేడా లేకుండా వరుసగా 27 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా సాగిన జొకో.. యూఎస్‌ ఓపెన్‌ తుదిమెట్టుపై తడబడ్డాడు. సోమవారం తెల్లవారుజామున ముగిసిన యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-4, 6-4, 6-4తో జొకోవిచ్‌ను చిత్తుచేసి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. 2 గంటలా 15 నిమిషాల పాటు సాగిన తుది పోరులో.. 25 ఏండ్ల మెద్వెదెవ్‌ పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. ఆట ఆరంభం నుంచే ఒత్తిడిలో కనిపించిన 34 ఏండ్ల జొకో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంటే.. ఫుల్‌ జోష్‌తో ముందుకు సాగిన మెద్వెదెవ్‌ తొలి 23 సర్వీస్‌ల్లో 20 పాయింట్లు సాధించి తన ఉద్దేశాన్ని చాటాడు. మొత్తంగా మెద్వెదెవ్‌ 16 ఏస్‌లు సంధిస్తే.. జొకో ఆరింటికే పరిమితమయ్యాడు. మెద్వెదెవ్‌ 38 విన్నర్స్‌తో ముందంజలో నిలిస్తే.. 38 అనవసర తప్పిదాలతో జొకో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 25 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో ఇద్దరు ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడినా.. అనుభవం ముందు యువతరానిదే పైచేయి అయింది. మ్యాచ్‌ అనంతరం పరస్పరం ఒకరిపై ఒకరు ప్రశంసించుకున్న ఆటగాళ్లు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ తమను ఉత్సాహపరిచేందుకు మైదానానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఒటమి ఎరుగకుండా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌ నెగ్గిన జొకో.. జూన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, జూలైలో వింబుల్డన్‌ టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ చరిత్రలో అత్యధిక (20) గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న జొకో.. ఈ టైటిల్‌తో వారిని దాటి రికార్డు పుటల్లోకెక్కాలని భావించినా.. అతడి ఆశలపై మెద్వెదెవ్‌ నీళ్లు కుమ్మరించాడు. సీజన్‌ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌లో జొకో చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న మెద్వెదెవ్‌.. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తన పేరిట రాసుకున్నాడు. రికార్డు స్థాయిలో 31వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ బరిలోకి దిగిన జొకోవిచ్‌.. తీవ్ర ఒత్తిడిలో కనిపించగా.. మెద్వెదెవ్‌ ఆడుతూ పాడుతూ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించే అవకాశం వస్తే అందులో ఒక్కదాన్ని వినియోగించుకున్న జొకో.. చరిత్రకెక్కాలనే తొందరలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఒక దశలో ఒత్తిడిని తట్టుకోలేక తన రాకెట్‌ను నేలకేసి కొట్టిన జొకోవిచ్‌.. నిబంధనలను ఉల్లంఘించి చైర్‌ అంపైర్‌తో చివాట్లు తిన్నాడు. ఆరడుగుల ఆరు అంగుళాల మెద్వెదెవ్‌ బలమైన గ్రౌండ్‌ స్ట్రోక్స్‌తో పాటు మైండ్‌ గేమ్‌తో జొకోపై ఆధిపత్యం కనబర్చాడు. కోర్టు మూలలకు కాకుండా.. సెంటర్‌ కోర్టు వైపు ఎక్కువ షాట్లు ఆడిన మెద్వెదెవ్‌.. ప్రత్యర్థిని అలిసిపోయేలా చేసి పైచేయి సాధించాడు. 207 కిలోమీటర్ల వేగంతో చేసిన సర్వీస్‌కు ప్రత్యర్థి నుంచి సమాధానం లేకపోవడంతో.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన మెద్వెదెవ్‌ ఉన్నచోటే ఒక్కసారిగా కూలబడ్డాడు. సాకార్‌ వీడియో గేమ్‌లో గోల్‌ చేసిన అనంతరం నేల మీద పడిపోతూ చేసుకునే సంబురాలను తలపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

‘డెడ్‌ ఫిష్‌’ సెలెబ్రెషన్‌..
కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను చిత్తు చేసిన మెద్వెదెవ్‌ ఉన్నఫళంగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఫిఫా సాకర్‌ ప్లేస్టేషన్‌ వీడియో గేమ్‌లో మ్యాచ్‌ ముగిసిన తర్వాత చేసుకునే సంబురాలను తలపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇది ‘డెడ్‌ ఫిష్‌’ తరహా సంబురమన్న మెద్వెదెవ్‌.. దిగ్గజాలకు మాత్రమే అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు.

‘మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇద్దరిపై ఒత్తిడి ఉందనేది వాస్తవం. జొకో జైత్రయాత్రను అడ్డుకోవాలని బలంగా అనుకున్నా. అందుకే మైదానంలో తీవ్రంగా శ్రమించా. ఈ ఫలితం జొకోను తీవ్ర నిరాశకు గురిచేసి ఉంటుంది. నేను ఈ మాట ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కానీ అందుకు ఇదే సరైన సందర్భం అనుకుంటున్నా. నా వరకు టెన్నిస్‌ చరిత్రలో నువ్వే (జొకోవిచ్‌) అత్యుత్తమ ఆటగాడివి’

  • మెద్వెదెవ్‌, విజేత

‘టోర్నీ ముగియడం కాస్త ఉపశమనాన్నిచ్చింది. గత రెండు వారాలుగా మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యా. తుది ఫలితం సంతృప్తినివ్వలేదు. అతడు (మెద్వెదెవ్‌) చాలా బాగా ఆడాడు. ఈ విజయానికి అతడే అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి ఆట, ఆలోచనా విధానం, ఎత్తుగడకే ఈ గౌరవం దక్కాలి’

  • జొకోవిచ్‌, రన్నరప్‌

ప్రైజ్‌మనీ
విజేత (మెద్వెదెవ్‌) – రూ. 18 కోట్లు
రన్నరప్‌(జొకోవిచ్‌) రూ. 9 కోట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana