గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 21, 2020 , 14:21:45

చెన్నైకి షాక్‌.. ఐపీఎల్‌ నుంచి డ్వేన్‌ బ్రావో ఔట్‌

చెన్నైకి షాక్‌.. ఐపీఎల్‌ నుంచి డ్వేన్‌ బ్రావో ఔట్‌

దుబాయ్‌:  ఐపీఎల్‌-13 సీజన్‌లో  వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.   ఆ జట్టు    ఆల్‌రౌండర్‌  డ్వేన్‌ బ్రావో గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.  కుడి గజ్జల్లో   గాయం కారణంగా    గత శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్రావో ‌ బౌలింగ్‌ను   వేయలేకపోయిన విషయం తెలిసిందే. 

గాయం కారణంగా  బ్రావో ఇక మ్యాచ్‌లు ఆడలేడని,  ఈ ఐపీఎల్ సీజన్ నుంచి   తప్పుకున్నాడని  చెన్నై సీఈవో  కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. 'ఐపీఎల్‌ 2020 సీజన్‌లో బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయంతో అతడు మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. ఒకటి లేదా  రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడని' విశ్వనాథన్‌ వివరించారు. 

మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ చెన్నై ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉంది.  వ్యక్తిగత కారణాలతో సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ టోర్నీ నుంచి వైదొలగడంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంలో విఫలమవడంతో జట్టు్ ఓటములను ఎదుర్కొంది.