మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 00:33:22

రేసులోకి చెన్నై

రేసులోకి చెన్నై

  • హైదరాబాద్‌పై ధోనీసేన గెలుపు 
  • విలియమ్సన్‌ పోరాటం వృథా

ప్లేఆఫ్స్‌ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ జూలు విదిల్చింది. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ధోనీసేన.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. భారీ షాట్లు ఆడేందుకు ఏమాత్రం వీలులేని బౌలింగ్‌తో పాటు.. క్రీజు దాటితే రనౌట్‌ కావడం ఖాయమే అనే ఫీల్డింగ్‌తో హైదరాబాద్‌ను కట్టిపడేసింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం మరోసారి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టింది.

దుబాయ్‌: వరుస పరాజయాలతో సతమతమవుతున్న ధోనీ సేన.. కీలక సమయంలో అత్యవసర విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) 20 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (38 బంతుల్లో 42; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), అంబటి రాయుడు (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఓపెనర్‌గా సామ్‌ కరన్‌..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా క్రీజులో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (0) ఎదుర్కొన్న తొలిబంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై 10 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన కరన్‌ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో.. వాట్సన్‌, రాయుడు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక రాయుడు, వాట్సన్‌ ఔటయ్యారు. ఆఖర్లో ధోనీ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), జడేజా (10 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్స్‌) విలువైన పరుగులు జోడించారు.

కేన్‌ ఒంటరి పోరాటం

ఓ మాదిరి లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ ఆకట్టుకోలేకపోయింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డ వార్నర్‌ (9) త్వరగానే ఔట్‌ కాగా.. మనీశ్‌ పాండే (4) నిరాశపరిచాడు. క్రీజులో కుదురుకునేందుకు యత్నించిన బెయిర్‌స్టో (23)ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి వార్నర్‌ సేన 60/3తో నిలిచింది. కాసేపు విలియమ్సన్‌కు సహకారం అందించిన ప్రియం గార్గ్‌ (16) కూడా వెనుదిరగగా.. విజయ్‌ శంకర్‌ (12) అతడిని అనుసరించాడు. 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న విలియమ్సన్‌ ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ ఓటమి ఖాయమైంది.  

స్కోరు బోర్డు

చెన్నై: సామ్‌ కరన్‌ (బి) సందీప్‌ 31, డుప్లెసిస్‌ (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ 0, వాట్సన్‌ (సి) పాండే (బి) నటరాజన్‌ 42, రాయుడు (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 41, ధోనీ (సి) విలియమ్సన్‌ (బి) నటరాజన్‌ 21, జడేజా (నాటౌట్‌) 25, బ్రావో (బి) ఖలీల్‌ 0, దీపక్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 167/6. వికెట్లపతనం: 1-10, 2-35, 3-116, 4-120, 5-152, 6-152, బౌలింగ్‌: సందీప్‌ 4-0-19-2, ఖలీల్‌ 4-0-45-2, నదీమ్‌ 4-0-29-0, నటరాజన్‌ 4-0-41-2, రషీద్‌ 4-0-30-0.

హైదరాబాద్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) సామ్‌ కరన్‌ 9, బెయిర్‌స్టో (బి) జడేజా 23, పాండే (రనౌట్‌) 4, విలియమ్సన్‌ (సి) శార్దుల్‌ (బి) కరణ్‌ శర్మ 57, ప్రియమ్‌ (సి) జడేజా (బి) కరణ్‌ శర్మ, విజయ్‌ శంకర్‌ (సి) జడేజా (బి) బ్రావో 12, రషీద్‌ (హిట్‌వికెట్‌) శార్దుల్‌ 14, నదీమ్‌ (సి అండ్‌ బి) బ్రావో 5, సందీప్‌ (నాటౌట్‌) 1, నటరాజన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 147/8. వికెట్ల పతనం: 1-23, 2-27, 3-59, 4-99, 5-117, 6-126, 7-146, 8-146, బౌలింగ్‌: దీపక్‌ 4-0-28-0, సామ్‌ కరన్‌ 3-0-18-1, జడేజా 3-0-21-1, శార్దుల్‌ 2-0-10-1, కరణ్‌ శర్మ 4-0-37-2, బ్రావో 3-0-25-2, చావ్లా 1-0-8-0.