గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 29, 2020 , 16:53:25

చెన్నైకి గుడ్‌న్యూస్‌ ..ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు!

చెన్నైకి గుడ్‌న్యూస్‌ ..ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు!

దుబాయ్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు శుభవార్త.  వరుస ఓటములతో  ఢీలాపడిన చెన్నై తుదిజట్టులో  చేరేందుకు  ఇద్దరు కీలక  ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. చెన్నై ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌  డ్వేన్‌ బ్రావో గాయం కారణంగా ఒక్కటి కూడా ఆడలేదు.  తన అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌తో టోర్నీ తొలి  మ్యాచ్‌లో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడు గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.  

స్టార్‌ ప్లేయర్లు ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై ఆడే తర్వాతి పోరులో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్రాంఛైజీ సీఈవో  కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. 'తొడకండరాల నొప్పి నుంచి రాయుడు కోలుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో అతడు ఆడతాడు. ట్రైనింగ్‌లో అతడు బాగానే  పరుగెత్తాడు. నెట్స్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేశాడని' విశ్వనాథన్‌ చెప్పారు. 

లోయర్‌ ఆర్డర్‌లో చెన్నై జట్టుకు అతిపెద్ద బలం బ్రావోనే. కీలక సమయాల్లో బ్యాట్‌, బంతితో మెరువగల అద్భుతమైన  ఆల్‌రౌండర్‌. పవర్‌ హిట్టింగ్‌తో జట్టుకు విలువైన పరుగులు జోడించే బ్రావో జట్టులోకి వస్తే ధోనీసేన  బలం మరింత  పెరగనుంది. తొడ  గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బ్రావో ఫిట్‌నెస్‌ సాధించాడు.  'నెట్స్‌లో బ్రావో గొప్పగా బౌలింగ్‌  చేస్తున్నాడని' విశ్వనాథన్‌ వెల్లడించారు.  సీఎస్‌కే వేగంగా పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

గతంలోనూ ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టిగా పుంజుకున్నాం. ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్లీ గాడిలో పడతామని  ఆశాభావం వ్యక్తం చేశారు.  చెన్నై తన తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. 


logo