బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 15:47:04

ఐపీఎల్‌ 2021లోనూ ధోనీనే..

ఐపీఎల్‌ 2021లోనూ  ధోనీనే..

దుబాయ్:‌ ఐపీఎల్‌-13 సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారికంగా ప్లేఆఫ్‌కు దూరమైంది.   ఐపీఎల్‌ చరిత్రలో  తొలిసారి   చెన్నై  టీమ్‌ ప్లేఆఫ్‌   రేస్ నుంచి నిష్క్రమించింది.  టోర్నీ  ఆరంభానికి ముందే కీలక ఆటగాళ్లు సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌   వైదొలగడంతో  జట్టు కూర్పు, ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమిష్టిగా రాణించడంలో విఫలమవడంతో చెన్నై ఓటములను ఎదుర్కొంది.  మ్యాచ్‌ అనంతరం ధోనీ   ఆటగాళ్లకు తన జెర్సీలను గిఫ్ట్‌గా ఇస్తున్నాడు.

మహీ త్వరలోనే ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెప్పబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు.  వచ్చే ఏడాది  ఐపీఎల్‌  సీజన్‌లోనూ చెన్నై జట్టుకు ధోనీనే నాయకత్వం వహిస్తాడని ప్రకటించారు. 

'అవును, కచ్చితంగా. 2021లో ధోనీనే చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తాడని చాలా నమ్మకం ఉంది.  ఐపీఎల్‌లో మా జట్టు కోసం మూడు టైటిళ్లు సాధించాడు. లీగ్‌ చరిత్రలో  తొలిసారి ప్లేఆఫ్‌కు దూరమయ్యాం. ఇప్పటి వరకు  ప్రతీ సీజన్‌లో    కనీసం ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాం.   ఈ ఏడాది సీజన్‌ను చెత్తగా ముగించినంత మాత్రాన ప్రతీ విషయంలోనూ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. గెలిచే మ్యాచ్‌లనూ కూడా చేజార్చుకున్నాం. రైనా, హర్భజన్‌ అందుబాటులో లేకపోవడం, కరోనా కేసులు తీవ్ర ప్రభావం చూపించాయని' విశ్వనాథన్‌ వివరించారు.