బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 00:33:25

ఎన్నిక ఏకపక్షమేనా..!

ఎన్నిక ఏకపక్షమేనా..!
  • జయేశ్‌రంజన్‌, జగన్‌మోహన్‌రావు వ్యూహాత్మక అడుగులు ..
  • మెజార్టీ క్రీడాసంఘాల మద్దతు కూడగట్టడంలో సఫలం
  • జయేశ్‌ వర్గం గెలుపు నల్లేరుపై నడకే!..
  • నేడే తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఎన్నో మలుపులు, నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. నగరంలోని ఎల్బీ స్టేడియం ఒలింపిక్స్‌ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి  3 గంటల వరకు టీవోఏ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ న్యాయపోరాటంతో నామినేషన్‌ను నెగ్గించుకొని.. అధ్యక్ష పదవి రేసులోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అధ్యక్షుడిగా జయేశ్‌, ప్రధాన కార్యదర్శిగా అదే ప్యానల్‌కు చెందిన రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఎన్నికవడం ఖాయమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. క్రీడా సంఘాల మద్దతు కూడగట్టడం, ఆకట్టుకునే హామీలతో కూడిన మ్యానిఫెస్టో.. వెరసి జయేశ్‌ వర్గం గెలుపు తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష రేసులో జయేశ్‌తో పాటు 86 ఏండ్ల కె.రంగారావు ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఏ.జగన్మోహన్‌ రావుతో జగదీశ్వర్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం నలుగురు, జాయింట్‌ సెక్రటరీ స్థానానికి నలుగురు పోటీలో ఉన్నారు.


జయేశ్‌ వర్గానికే మొగ్గు..! 

తొలుత టీవోఏ అధ్యక్ష రేసులో జయేశ్‌ రంజన్‌, రంగారావు, జితేందర్‌ రెడ్డి నిలువగా.. రంగారావు మినహా ఇద్దరి నామినేషన్లను ఎన్నికల అధికారి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లిన జయేశ్‌ రంజన్‌ పోటీ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ ఆయన వర్గానికి సానుకూలంగా మారాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జయేశ్‌ అధ్యక్షుడిగా ఉంటే ప్రభుత్వంతో పాటు భారత ఒలింపిక్‌ సంఘంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ర్టాన్ని క్రీడారంగంలో అభివృద్ధి పథాన నడిపిస్తారని క్రీడాసంఘాలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి పోటీలో ఉన్న జగన్‌మోహన్‌ రావుకు కార్పొరేట్‌ సంస్థలతో మంచి సంబంధాలు ఉండడంతో ఆయన కూడా క్రీడాభివృద్ధికి దోహదపడగలరని క్రీడా సంఘాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. క్రీడాసంఘాలతో పాటు జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్లు కూడా జయేశ్‌ వర్గానికి జై కొడితేనే రాష్ట్రంలో క్రీడాభివృద్ధి రాకెట్‌ వేగాన్నందుకుంటుందనే యోచనలో ఉన్నాయి. మరోవైపు జితేందర్‌ రెడ్డి-జగదీశ్‌ వర్గం 86 ఏండ్ల రంగారావును అధ్యక్ష పదవి అభ్యర్థిగా నిలబెట్టడమూ జయేశ్‌ వర్గానికి కలిసివచ్చేదే. 


ఆకట్టుకునేలా మ్యానిఫెస్టో

దార్శనికమైన ప్రణాళికలు, అభివృద్ధి పనులతో కూడిన మ్యానిఫెస్టో సైతం జయేశ్‌ రంజన్‌ వర్గాన్ని గెలుపు పథాన నడిపిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సంఘంతో చర్చించి.. ఒలింపిక్‌ నిధుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాతో పాటు ఎల్బీ స్టేడియంలోని భవనంలో వాటా సైతం తక్షణమే వచ్చేలా కృషి చేస్తామని జయేశ్‌ వర్గం హామీ ఇచ్చింది. అదే విధంగా ప్రభుత్వ సహకారంతో త్వరలోనే రాష్ట్రంలో ఓ భారీ క్రీడా ఈవెంట్‌ నిర్వహించేందుకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంతో పాటు అన్ని క్రీడా ప్రాంగణాల్లో హరిత క్యాంటిన్లు ప్రారంభించి క్రీడాకారులకు సబ్సిడీతో మూడు పూటలా పౌష్టికాహారం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతోపాటు మిగిలిన హామీలను సైతం దృష్టిలో ఉంచుకున్న క్రీడాసంఘాలు జయేశ్‌-జగన్‌మోహన్‌ రావు వర్గానికి జై కొట్టాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం.


logo