బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 00:15:58

ఒక్కదానికే..!

ఒక్కదానికే..!

గతేడాది కరీబియన్‌ దీవుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పరుగు ప్రారంభించిన టీమ్‌ఇండియా.. వెస్టిండీస్‌ వెన్ను విరిచి..సఫారీలను సఫా చేసి.. బంగ్లాదేశ్‌ కొమ్ములు వంచి అజేయంగా ఏడు విజయాలు ఖాతాలో వేసుకొని న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. అప్పటివరకు ధీరులుగా కనిపించిన మనవాళ్లు.. కివీస్‌ గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్‌రౌండ్‌ ఫ్లాప్‌ షోతో తొలి టెస్టును ప్రత్యర్థికి సమర్పించుకొని చాంపియన్‌షిప్‌లో మొదటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఒక్క ఓటమితోనే అంతా అయిపోయినట్లుకాకున్నా.. బ్లాక్‌క్యాప్స్‌పై మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ కన్నేస్తే..

విరాట్‌ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే టెస్టు క్రికెట్‌లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లోనూ అదే జోరు కొనసాగిస్తూ వచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు వరకు డబ్ల్యూటీసీలో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసిన భారత్‌కు.. న్యూజిలాండ్‌ రూపంలో తొలి దెబ్బ ఎదురైంది. ‘ఒక్క ఓటమితో పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’అని కెప్టెన్‌ కోహ్లీ అంటున్నా.. వరుసగా ఏడు టెస్టుల్లో ఎదురులేకుండా సాగిన టీమ్‌ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడటం అభిమానులకు మింగుడుపడటం లేదు. రెండో మ్యాచ్‌లోనూ ఓడినా మేం పెద్దగా పట్టించుకోబోమని కోహ్లీ పేర్కొంటుంటే.. మరోవైపు నుంచి ఇప్పటికే విమర్శల వర్షం ప్రారంభమైంది. 


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టులకు ఎంపిక చేయకపోవడంపై క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఉపఖండంలోలాగా ఆడితే న్యూజిలాండ్‌ గడ్డపై టెస్టు నెగ్గడం అంత సులువు కాదు’అని కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రెయిగ్‌ మెక్‌మిలన్‌ అంటుంటే.. విరాట్‌ కోహ్లీ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణం అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్‌ హగ్‌ మరో అడుగు ముందుకేసి ‘న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి రెండు వారాలే టీమ్‌ఇండియా అసలు సిసలు క్రికెట్‌ ఆడింది. ఆ తర్వాత నాలుగు వారాలు వారికి కివీస్‌ టూర్‌ విహార యాత్రగా మారింది’అని విమర్శలు ఎక్కుపెట్టాడు. బయటి వారి మాటలను పెద్దగా పట్టించుకోమంటున్న కోహ్లీ.. నెట్స్‌లో చెమటోడ్చి రెండో టెస్టులో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి తొలి మ్యాచ్‌లో మనవాళ్ల పొరపాట్లేంటో ఓసారి పరిశీలిస్తే..


వాళ్లిద్దరి వల్లే..

బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో భారత మూల స్తంభాలైన విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణం అనేది ఆట చూసిన వారెవరికైనా ఇట్టే అవగతమవుతుంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించే కోహ్లీ ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయా డు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి వరుసగా 45, 11, 38, 11, 51, 15, 9, 2, 19 పరుగులు చేశాడు. మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో అతడి బ్యాట్‌ నుంచి ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. సంప్రదాయ క్రికెట్‌లో ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తిన రోహిత్‌ శర్మ గాయం కారణంగా పర్యటనకు దూరం కావడంతో కోహ్లీపై అదనపు భారం పడిందనేది వాస్తవం. అయితే పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ దూసుకెళ్లే కోహ్లీ ప్రస్తుతం కాస్త అయోమయంలో కనిపిస్తున్నాడు. 


చివరి 20 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఒక్క శతకం కూడా నమోదు చేయకపోవడం మరింత ఆందోళన పరుస్తున్న అంశం. రెండుమూడేండ్లుగా ఎలాంటి పిచ్‌పైనైనా వికెట్లు పడగొడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పేసర్‌గా పేరు తెచ్చుకున్న యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం కూడా ఫలితంపై ప్రభావం చూపింది. శస్త్రచికిత్స తర్వాత కోలుకొని పునరాగమనం చేసిన అతడు వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోగా.. తొలి టెస్టులో కేవలం ఒక వికెట్‌ మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. వన్డే సిరీస్‌ అనంతరం న్యూజిలాండ్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ మాట్లాడుతూ.. ‘బుమ్రాను చూసి ప్రపంచంలో ఇక ఏ జట్టు భయపడదు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ బుమ్రాస్ర్తాన్ని ఛేదించారు. ఇక మిగిలిన జట్లు కూడా అతడిని మెరుగ్గా ఎదుర్కొంటాయి’అని పేర్కొనడం మరింత కలవరపాటుకు గురిచేస్తున్నది. అయితే సహచర పేసర్లు ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ మాత్రం బుమ్రాను వెనకేసుకొచ్చారు. అతడు చాంపియన్‌ బౌలర్‌ అని నాలుగు మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోవడంతోనే అతడిని తక్కువ అంచనా వేయడం తగదని అంటున్నారు. మరి క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులో బుమ్రా తన బుల్లెట్లకు పదును పెంచి విమర్శకుల నోరు మూయిస్తాడా చూడాలి.


రాహుల్‌ ఉండుంటే..

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా తరఫున అదరగొట్టిన ఆటగాడెవరైనా ఉన్నాడంటే నిస్సందేహంగా అతడు లోకేశ్‌ రాహులే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 224 పరుగులు చేసిన అతడు మూడు వన్డేల్లో 204 రన్స్‌ కొట్టాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరుగుల వరద పారించినా.. టెస్టులకొచ్చేసరికి అతడికి జట్టులోనే చోటు దక్కలేదు. రోహిత్‌ గైర్హాజరిలో మయాంక్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షాను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. పృథ్వీలో ప్రతిభకు కొదవ లేకున్నా.. కివీస్‌ పేసర్లను ఎదుర్కోవడంలో మాత్రం అతడు తడబడ్డాడనే చెప్పాలి. 


logo
>>>>>>