ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 26, 2020 , 00:39:28

ఆ విజయం.. అద్వితీయం

ఆ విజయం.. అద్వితీయం

  • 1983 ప్రపంచకప్‌ గెలుపును గుర్తు చేసుకున్న క్రికెటర్లు

వరల్డ్‌కప్‌ నెగ్గిన క్షణాలు మా జీవితంలోనే అత్యంత మధురమైనవి. కప్పు అందుకున్నప్పుడు గర్వంగా అనిపించింది. దేశమంతా సంబురాలు జరుపుకొనేలా చేసినందుకు చాలా సంతోషించాం. ఆ గెలుపు తర్వాత దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలవైపు నడిపించారు. 37 ఏండ్ల క్రితం ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేం.  

-కపిల్‌ దేవ్‌, 1983 భారత జట్టు కెప్టెన్‌ 


న్యూఢిల్లీ: భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడి గురువారానికి 37 ఏండ్లు పూర్తయ్యాయి. హర్యానా హరికేన్‌ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని అప్పటి ఆటగాళ్లతో పాటు ప్రస్తుత ప్లేయర్లు గుర్తు చేసుకున్నారు. ఆ విజయం ఎంతో అద్వితీయమని, దేశంలో క్రికెట్‌ స్థితి.. గతిని మార్చిందని కీర్తించారు. అనామక జట్టుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి.. మహామహుల్ని ఓడిస్తూ విశ్వవిజేతగా నిలువడం భారత క్రీడారంగానికి అతిపెద్ద స్ఫూర్తి అని కొనియాడారు. దేశాన్ని క్రికెట్‌ వైపునకు అడుగులు వేయించిందని గురువారం సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.


బలంగా విశ్వసించాం.. ప్రపంచ చాంపియన్లుగా అవతరించాం. భారత్‌లో క్రికెట్‌ ముఖచిత్రాన్ని 1983 జూన్‌ 25న మార్చేశాం. 

- రవిశాస్త్రి

ఆ సంతోషాన్ని ఎలా వివరించాలి? లార్డ్స్‌లోని వేలాది మంది భారతీయుల ముందు ప్రపంచ చాంపియన్లుగా అవతరించిన క్షణంలో కలిగిన ఫీలింగ్‌ను ఎలా చెప్పాలి? కలయా.. నిజమా అని నన్ను నేను గిల్లి చూసుకున్నా. వివ్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను కపిల్‌ అద్భుతంగా అందుకోవడమే ఫైనల్‌లో టర్నింగ్‌ పాయింట్‌.        

- కీర్తి ఆజాద్‌


భారత క్రికెట్‌ చరిత్రలో అదో అద్భుత ఘట్టం. ఆ తర్వాత మనదేశంలో క్రికెట్‌ క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతూ పోయింది. కపిల్‌దేవ్‌ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. టోర్నీ ఆసాంతం బంతితోనూ, బ్యాట్‌తోనూ కపిల్‌ విజృంభించాడు. దాంతోనే ఇది సాధ్యమైంది.                                                  - దిలీప్‌ వెంగ్‌సర్కార్‌


1983 ప్రపంచకప్‌ ఫైనల్‌ నా జీవితంలో మైలురాయి లాంటిది. బీఎస్‌ సంధు బౌలింగ్‌లో గ్రీనిడ్జ్‌ ఇచ్చిన క్యాచ్‌ను కపిల్‌ పాజీ పట్టినప్పటి నుంచి అన్ని వికెట్లకు నేను, నా స్నేహితులం సంబురాలు చేసుకున్నాం. వెస్టిండీస్‌ వికెట్‌ పడిన ప్రతీసారి గంతులు వేశాం. అది ఎంతో అద్వితీయమైన సాయంత్రం. 

- సచిన్‌ టెండూల్కర్‌


37 ఏండ్ల క్రితం ఇదే రోజు భారత్‌ ప్రపంచకప్‌ను సాధించింది. ఆ అద్భుతమైన జట్టులో భాగమవడం, కపిల్‌దేవ్‌ నేతృత్వంలో ఆడడం ఎంతో గౌరవంగా, గొప్ప వరంగా భావిస్తున్నా. ఆ చరిత్రాత్మక ఘట్టం గురించి ఆలోచిస్తే నాకు ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 

- కృష్ణమాచారి శ్రీకాంత్‌1983 ప్రపంచకప్‌ విజయం చాలా కీలకం. ఎందుకంటే అంతకుముందు అంతర్జాతీయ స్థాయిలో మేం పెద్దగా సాధించిందేం లేదు. ఆ గెలుపు భారత క్రికెట్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపి.. అసాధ్యమనేది లేదు.. ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది. 

- మొహీందర్‌ అమర్‌నాథ్‌


దేశం మొత్తం గర్వించిన క్షణాలు, మా సీనియర్లు 1983లో ఇదే రోజు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు.   ఆ జట్టులోని ప్రతి సభ్యుడికీ శుభాకాంక్షలు. 2011 లో మేం విశ్వటోర్నీ సాధించేందుకు ప్రమాణాన్ని నిర్దేశించారు. అన్ని క్రీడల్లో భారత్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలువాలని ఆశిస్తున్నా.         

- యువరాజ్‌ సింగ్‌


logo