ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 18, 2021 , 02:43:55

సీఎం కేసీఆర్‌ కప్‌ విజేత ఎమ్‌సీసీ

సీఎం కేసీఆర్‌ కప్‌ విజేత ఎమ్‌సీసీ

  • ఫైనల్లో ఇండియన్‌ ఎలెవన్‌పై విజయం 

సిద్దిపేట కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీలో ఎమ్‌సీసీ జట్టు టైటిల్‌ విజేతగా నిలిచింది. బుధవారం స్థానిక స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఎమ్‌సీసీ 36 పరుగుల తేడాతో ఇండియన్‌ ఎలెవెన్‌ జట్టుపై విజయం సాధించింది. తొలుత ఎమ్‌సీసీ నిర్ణీత 10 ఓవర్లలో 100 పరుగులు చేయగా, ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇండియన్‌ ఎలెవన్‌ 64 పరుగులకే ఆలౌటైంది. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. టైటిల్‌ విన్నర్‌ ఎమ్‌సీసీకి రూ.లక్ష రూపాయల నగదు బహుమతి దక్కగా, రన్నరప్‌కు 50వేలతో పాటు ట్రోఫీ లభించింది. ఎమ్‌సీసీ ప్లేయర్‌ అఫ్రిదీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌', గోర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్‌ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారు. క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే 14 ఏండ్ల పాటు ప్రత్యర్థులు బౌన్సర్లు వేసినా, ఎన్ని విధాలా ఔట్‌ చేయాలని చూసినా గట్టిగా నిలబడి ఆమరణ నిరాహార దీక్ష అనే విన్నింగ్‌ షాట్‌తో తెలంగాణను సాధించారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, మల్లికార్జున్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

VIDEOS

logo