శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 17:12:51

యువ క్రికెటర్లకు గుడ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ వీడియోతో నేషనల్‌ టీంలో చోటు

యువ క్రికెటర్లకు గుడ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ వీడియోతో నేషనల్‌ టీంలో చోటు

ఢాకా:  కరోనా మహమ్మారి  నేపథ్యంలో చాలా దేశాల్లో  మైదానాలు,  స్టేడియాలు మూత పడ్డాయి.  క్రీడాకారులు ఇళ్ళకే పరిమితమై సాధనకు  దూరంగా ఉండిపోయారు. కొన్ని దేశాల్లో  మాత్రమే బయో బబుల్‌ వాతావరణంలో క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. కరోనాను దృష్టిలో ఉంచుకొని  యువ క్రికెటర్ల  ఎంపిక కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది.   వాట్సాప్‌  క్రికెట్‌ ట్రయల్స్‌తో బంగ్లా కొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీగా ఉన్నది.   

మంగళవారం బంగ్లాదేశ్‌ బోర్డు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.  ఈ కార్యక్రమం ద్వారా  ఔత్సాహిక క్రికెటర్లను జాతీయ సెలక్టర్ల దృష్టికి తీసుకువెళ్తుంది.  కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు  మైదానంలో మ్యాచ్‌ల ద్వారా తమ  ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లేకపోవడంతో  ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సాయంతో  ఆటగాళ్ల ప్రతిభను గుర్తించనుంది.  ప్రిలిమినరీ ట్రయల్స్‌ విజయవంతం కావడానికి   బంగ్లా సీనియర్‌ క్రికెటర్లు తమీమ్‌ ఇక్బాల్‌, ముష్పికర్‌ రహీమ్‌తో పాటు బంగ్లా అండర్‌-19 కెప్టెన్‌  అక్బర్‌ అలీ సహకరిస్తారు.  

వాట్సాప్‌ క్రికెట్‌ ట్రయల్స్‌ ప్రక్రియ గురించి బంగ్లా క్రికెట్‌ బోర్డు గేమ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ కవ్సర్‌ మాట్లాడుతూ... 'మొత్తం మూడు గ్రూపులు ఉంటాయి.  అండర్‌-14, అండర్‌-16, అండర్‌-18 క్రికెటర్ల కోసం వేర్వేరుగా గ్రూప్‌లు ఏర్పాటు చేస్తాం. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో వారి ట్రయల్‌ వీడియోలను  పంపవచ్చు. ప్రాంతీయ కోచ్‌లు వీటిని పరిశీలిస్తారు. ప్రతి జిల్లా లేదా డివిజనల్‌ అండర్‌-14 ఆటగాళ్ల నుంచి సుమారు 35-40 మందిని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.  అలాగే అండర్‌-16, అండర్‌-18 గ్రూప్‌ క్రికెటర్లకు చెందిన మరో 35 మంది ఆటగాళ్లను గుర్తిస్తారని' కవ్సర్‌ తెలిపారు. 

కరోనా తక్కువగా ఉన్న జిల్లాల్లోనే వాట్సాప్‌ క్రికెట్‌ ట్రయల్స్‌ ముందుగా ప్రారంభంకానున్నాయి.  ఎంపికైన ఆటగాళ్లు వ్యక్తిగత ట్రయల్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.  మళ్లీ ప్రతీ జిల్లా, డివిజన్‌లో ప్రతీ గ్రూప్‌ నుంచి సుమారు 15 మంది ఆటగాళ్ల బృందాన్ని ఎంపిక చేస్తారు.   ప్రతీ ఆటగాడు తమ ట్రయల్‌ వీడియోను సంబంధిత జిల్లా, డివిజనల్‌ కోచ్‌ల వాట్సాప్‌ నంబర్‌కు పంపించాలని బోర్డు కోరనుంది.