ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్‌ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీలను ఫాలో అవుతున్నారు. కూర్చున్నచోటే ఫోన్లో కావాల్సిన సినిమాను, కావాల్సినప్పుడు, మళ్లీ మళ్లీ చూసుకొనే వెసులుబాటు ఉండటంతో అంతా వీటికే జై కొడుతున్నారు. అదీకాక కరోనా టైం కదా.. రిస్క్ తీసుకోలేం అంటున్నారు ఇంకొందరు. ఓటీటీల పనేదో బాగుందని క్రికెట్ లైవ్ అప్డేట్స్, అనాలిసిస్‌ను అందించే క్రిక్‌బజ్ ( Cricbuzz ) కూడా ఓ అడుగు ముందుకేసింది.
యూజర్ల అవసరాన్ని గుర్తించిన క్రిక్‌బజ్.. మ్యాచ్ సాగుతుండగా క్రికెటర్లు ఔట్ అయిన వీడియో క్లిప్స్, విన్నింగ్ సెలబ్రేషన్స్, ఇతర వీడియోలను చూపిస్తోంది. అయితే, ఆ వీడియోలను చూడాలంటే చార్జీని బట్టి ప్లాన్లు ఉన్నాయని చెప్తున్నది. క్రిక్‌బజ్ ప్లస్ ( Cricbuzz Plus ) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద క్రిక్‌బజ్ ప్లస్, టైమ్స్ ప్రైమ్( వన్ ఇయర్ కాంబో)కు రూ.999, క్రిక్‌బజ్ ప్లస్ (వన్ ఇయర్) అయితే రూ.500, మూడు నెలల ప్లాన్‌కు రూ.250 చార్జి చేస్తోంది.