ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 23:53:46

విరాళాల వెల్లువ

విరాళాల వెల్లువ

  • కరోనాపై పోరులో క్రీడాకారుల ఆర్థిక సహాయం 

‘ప్రార్థించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న’. ఆపత్కాలంలో ఆదుకునేవారే ఆపద్భాంవులు. మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతున్న వేళ..ఆపన్నులను ఆదుకునేందుకు తామున్నామంటూ క్రీడాకారులు ముందుకొస్తున్నారు. తమకు తోచిన విధంగా విరాళాలిస్తు పెద్ద మనసును చాటుకుంటున్నారు. కొందరు డబ్బులు సహాయం చేస్తుంటే..మరికొందరు అన్నదానంతో మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు క్రీడాకారులు చేయిచేయి కలుపుతున్నారు. కొవిడ్‌-19తో అతలాకుతలమైన  అభాగ్యులను ఆదుకునేందుకు ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ముందుకొస్తున్నారు. ఇది మన దేశానికే పరిమితం కాలేదు.. వైరస్‌తో సమస్య ఎదుర్కొంటున్న ప్రతి దేశంలో విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు తామున్నామంటూ సహాయం చేస్తున్నారు. కరోనాపై పోరాటంలో నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు హాకీ ఇండియా(హెచ్‌ఐ) శనివారం రూ.75 లక్షల విరాళమిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇచ్చిన రూ.25 లక్షలకు ఇది అదనమని హెచ్‌ఐ తెలిపింది. 

‘గత కొన్నేండ్లుగా జాతీయ క్రీడ హాకీ పట్ల ప్రజలు చూపించిన ఆదరణ అమోఘం. కరోనాతో కోట్లాది మంది కష్టాల్లో ఉన్నారు. మమ్మల్ని ఈ స్థాయికి చేర్చిన వారి రుణం తీర్చుకునేందుకు ఇది సరైన సమయం’ అని హెచ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ అన్నారు. మరోవైపు స్టార్‌ గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి..పీఎం కేర్స్‌ నిధికి రూ.7 లక్షలు విరాళంతో పాటు జొమాటో ద్వారా వంద కుటుంబాలకు అన్నదానం చేయబోతున్నట్లు ట్వీట్‌ చేశాడు. పారా జంపర్‌ శరద్‌ కుమార్‌...ఒడిశా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.2 లక్షలు విరాళమిచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఇది సరైన సమయమన్నాడు. పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌..పీఎం కేర్స్‌కు రూ.లక్ష సహాయం చేశాడు. భారత పారాలింపిక్‌ కమిటీ(పీసీఐ) సిబ్బంది..ఒక రోజు వేతనాన్ని ప్రధాని మంత్రి సహాయక నిధికి ఇచ్చారు. 

జొకో, నెయ్‌మర్‌ విరాళం: తమ ఆటతీరుతో అభిమానులను అలరించడంలోనే కాదు..క్లిష్ట పరిస్థితుల్లోనూ తాము అండగా నిలుస్తామని నెయ్‌మర్‌, జొకోవిచ్‌ నిరూపించారు. కరోనాతో కష్టాల్లో ఉన్న వారి ని ఆదుకునేందుకు ఇప్పటికే భారీ విరాళమిచ్చిన జొకోవిచ్‌.. నాదల్‌ చారిటీకి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కానీ ఎంత మొత్తమని ఎక్కడా వెల్లడించలేదు. జొకోవిచ్‌ మద్దతు మరువలేనిదంటూ.. నాదల్‌ ట్వీట్‌ చేశాడు. బ్రెజిల్‌ సాకర్‌ స్టార్‌ నెయ్‌మర్‌.. రూ.7.50కోట్లు యునిసెఫ్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించాడు.  

ఇంగ్లండ్‌ క్రికెటర్ల ఔదార్యం: కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ దేశవాసులను ఆదుకునేందుకు ఇంగ్లండ్‌ క్రికెటర్లు ఔదార్యం చూపించారు. సెంట్రల్‌ కాంట్రా క్టు క్రికెటర్లు అందరు కలిసి రూ.4.68 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మహిళా క్రికెటర్లు తమ మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

దాదా దాతృత్వం 

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోమారు తన ఉదారతను చాటుకు న్నాడు. కరోనా వైరస్‌ కారణంగా తినడానికి తిండి లేక తిప్పలు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాదా ముందుకొచ్చాడు. ఇప్పటికే బేలూరు మఠానికి రెండు టన్నుల బియ్యాన్ని విరాళమిచ్చిన గంగూలీ..తాజాగా ఇస్కాన్‌తో కలిసి  ప్రతిరోజు పదివేల మందికి భోజన సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా శనివారం ఇస్కాన్‌ సిటీ సెంటర్‌కు వచ్చిన ఈ మాజీ కెప్టెన్‌ పేదలకు అన్నదానం చేశాడు.

వీడియోలు కాదు.. పేదల ఆకలి తీర్చండి


కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌ ఎదుర్కొంటున్న తరుణంలో కొంత మంది సెలెబ్రిటీలు అదే పనిగా వంటల వీడియోలు పోస్ట్‌ చేస్తుండటంపై టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సీరియస్‌ అయ్యింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రతి రోజు వేలాది మంది పేదలు తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నారని, అలాంటి వారి కోసం ఆలోచిస్తే బాగుంటుందని సానియా ట్వీట్‌ చేసింది. 


logo