బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 00:07:52

రోహిత్‌ సాయం రూ.80 లక్షలు

రోహిత్‌ సాయం రూ.80 లక్షలు

ముంబై: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పెద్ద మనసు చాటుకున్నాడు. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటానికి తన వంతు సాయంగా రూ. 80 లక్షలు విరాళంగా అందించాడు. అందులో పీఎం కేర్స్‌ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, ఫీడింగ్‌ ఇండియా, వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌ సంస్థలకు చెరో రూ. 5 లక్షలు అందించినట్లు మంగళవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. పరిస్థితులు తిరిగి సాధారణంగా మారేలా కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా రోహిత్‌ పేర్కొన్నాడు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ప్రధాని మోదీతో పాటు నాయకులకు అండగా నిలువాల్సిన అవసరముందని హిట్‌మ్యాన్‌ అన్నాడు. భారత మాజీ ఆటగాడు, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే కూడా ప్రధాని సహాయ నిధితో పాటు కర్ణాటక ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించాడు. అయితే ఎంత మొత్తం విరాళంగా ఇచ్చింది మాత్రం కుంబ్లే పేర్కొనలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఇంట్లోనే ఉం టూ.. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ప్రతిఒక్కరు భాగస్వాము లు కావాలని జంబో ట్వీట్‌ చేశాడు. 


నీరజ్‌ సాయం రూ. 3 లక్షలు

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కష్ట కాలంలో తనవంతు సాయంగా రూ. 3 లక్షలు ప్రకటించాడు. కొవిడ్‌-19 మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరముందని నీరజ్‌ పేర్కొన్నాడు. పీఎం కేర్స్‌ నిధికి రూ. 2 లక్షలు, హర్యానా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళమిచ్చినట్లు నీరజ మంగళవారం ట్వీట్‌ చేశాడు. మరోవైపు భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) ప్రధాని సహాయ నిధికి రూ. 5 లక్షలు విరాళంగా అందించింది.


logo