ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 00:44:09

కింగ్స్‌కు కరోనా సెగ

కింగ్స్‌కు కరోనా సెగ

 దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్న వేళ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకు కరోనా సెగ తగిలింది. గత శుక్రవారం యూఏఈలో అడుగుపెట్టిన సూపర్‌ కింగ్స్‌ జట్టు.. ఆరు రోజుల క్వారంటైన్‌ ముగించుకొని ప్రాక్టీస్‌ మొదలు పెడదామని భావించింది. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో జట్టులోని ఒక ఫాస్ట్‌ బౌలర్‌తో పాటు 12 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో జట్టుకు చెందిన సీనియర్‌ అధికారి, మరొక అధికారి భార్యకు, ఇద్దరు సోషల్‌ మీడియా సిబ్బందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇటీవల భారత జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఓ యువ పేసర్‌ కొవిడ్‌-19 బారిన పడినట్లు సమాచారం. పాజిటివ్‌గా తేలిన వారిలోనూ ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అదనంగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. అనంతరం రెండు సార్లు ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు నిర్వహించి అందులో నెగిటివ్‌గా తేలితేనే వారిని బయో సెక్యూర్‌ వాతావరణంలోకి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే పాజిటివ్‌గా తేలిన వారిలో ఎవరిలోనూ వైరస్‌ లక్షణాలు లేకపోవడం ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. వీరితో ఎవరు కాంటాక్టు అయ్యారు అనేది ఇప్పుడు సమస్యగా మారింది. దుబాయ్‌కు రావడానికి ముందు సీఎస్‌కే యాజమాన్యం చెన్నైలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది. ఓవైపు నగరంలో 4 లక్షల కేసులు ఉన్న సమయంలో శిబిరం నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తాజా పాజిటివ్‌ కేసులతో మిగతా జట్లతో పోలిస్తే..చెన్నై తమ సన్నాహకాలను ఆలస్యంగా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తున్నది.   


logo