శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 02:26:04

సందిగ్ధంలో హాకీ శిబిరం

 సందిగ్ధంలో హాకీ శిబిరం

  • దవాఖానకు మన్‌దీప్‌సింగ్‌ 

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టును కరోనా వైరస్‌ వెంటాడుతూనే ఉన్నది. ఆటగాళ్లు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో ఈనెల 20 నుంచి బెంగళూరులోని సాయ్‌ కేంద్రం వేదికగా మొదలుకావాల్సిన శిక్షణ శిబిరం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సురేందర్‌ కుమార్‌, జస్‌కరణ్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, కిషన్‌ బహదూర్‌ పాఠక్‌, మన్‌దీప్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోవడంతో మన్‌దీప్‌సింగ్‌ను మంగళవారం దవాఖానకు సాయ్‌ తరలించింది. మరోవైపు ఇదే సాయ్‌ కేంద్రంలో శిక్షణ శిబిరం కోసం సిద్ధంగా ఉన్న 24 మంది మహిళా ప్లేయర్లలో ఎవరికీ వైరస్‌ లక్షణాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం.

ఇదే విషయమై సాయ్‌ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ ‘ఆరుగురు ఆటగాళ్లకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శిబిరం ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడింది. ఇంకా కొంత మంది వైరస్‌ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న మహిళల జట్టులో అందరికీ నెగిటివ్‌ వచ్చిం ది. క్వారంటైన్‌ గడువు ముగిసిన తర్వాత వారి శిక్షణ శిబిరం మొదలవుతుంది’ అని అన్నారు.  కాగా ఆట కంటే ప్రాణాలు ఎక్కువని భారత మాజీ కెప్టెన్‌ అజిత్‌పాల్‌ సింగ్‌ అన్నాడు. విరామ సమయంలో ఆటగాళ్లు సరైన ఆరోగ్య మార్గదర్శకాలు పాటించకపోవడమే దీనికి కారణమని సింగ్‌ విమర్శించాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత జట్లు రెండూ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 


logo