ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 27, 2020 , 00:58:54

టోక్యో ఈవెంట్స్‌పై కరోనా ఎఫెక్ట్‌

టోక్యో ఈవెంట్స్‌పై కరోనా ఎఫెక్ట్‌
  • రెండు వారాల పాటు టోర్నీలు వాయిదా

టోక్యో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌పై కూడా కనిపిస్తున్నది. ఈశాన్య దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఒలింపిక్స్‌ నిర్వాహకులు రెండు వారాల పాటు తమ కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ మేరకు బుధవారం జపాన్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మెగాటోర్నీకి ముందు జరగాల్సిన అనేక ఈవెంట్‌లను తాత్కాళికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే భయపడాల్సిన అవసరమేమీలేదని.. విశ్వక్రీడలకు ఇంకా చాలా సమయం ఉందని ప్రస్తుతానికి షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ‘ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించడమే మా ప్రాథమిక ఆలోచన. ఈ అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)తో కూడా చర్చిస్తున్నాం. ప్రతి ఈవెంట్‌పై స్పష్టత వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని ఒలింపిక్స్‌ సీఈవో తషిరో మోటో తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో వేదికగా విశ్వ క్రీడలు జరగాల్సి ఉంది.


షూటింగ్‌ ప్రపంచకప్‌నకు 6 దేశాలు దూరం

వచ్చే నెల 15 నుంచి 26 వరకు ఢిల్లీ వేదికగా జరగాల్సి ఉన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌పై కరనో వైరస్‌ ఎఫెక్ట్‌ పడింది. చైనా సహా ఆరు దేశాలు ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాయి. ‘కరోనా కారణంగా కొన్ని దేశాలు షూటింగ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనడం లేదు. వైరస్‌ వ్యాప్తి చెందకూడదనే మంచి ఉద్దేశంతో చైనా పోటీల నుంచి స్వచ్చందంగా తప్పుకుంది. చైనాతో పాటు తైవాన్‌, హాంకాంగ్‌, మకావు, ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్‌ కూడా ఈ నిర్ణయానికే కట్టుబడ్డాయి. అని జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణిందర్‌ సింగ్‌ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం చైనా రెజ్లర్లకు వీసాలు నిరాకరించిన విషయం తెలిసిందే.


logo