గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 27, 2020 , 01:00:51

62 ఏండ్లలో అదరహో

62 ఏండ్లలో అదరహో

చికాగో: సాధించాలన్న కసి ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించాడు అమెరికాకు చెందిన జార్జ్‌ హుడ్‌. అవును ఆరు పదుల వయసులో ఎవరికి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. అమెరికా మాజీ మెరైన్‌ సైనికుడు అయిన 62 ఏండ్ల జార్జ్‌ సరికొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. చికాగోలో జరిగిన ఈ ఫీట్‌లో ఏకంగా ఎనిమిది గంటల 15నిమిషాల 15 సెకన్ల పాటు మోచేతులు, మునివేళ్లపై ఉండి ఔరా అనిపించాడు. దీని ద్వారా 2016లో చైనాలో మావో వీడాంగ్‌(ఎనిమిది గంటల ఒక నిమిషం) పేరు మీదున్న రికార్డును జార్జ్‌ తాజాగా తుడిచిపెట్టాడు. అయితే ఈ అద్భుత ఫీట్‌ వెనుక జార్జ్‌ వెలకట్టలేని శ్రమ దాగుంది. 


ప్రపంచ రికార్డును నెలకొల్పాలనే అకుంఠిత దీక్షతో జార్జ్‌ ఏకంగా 2,100 గంటల పాటు ప్లాంకింగ్‌(మోచేతులు, మునివేళ్లపై బ్యాలెన్స్‌ చేయడం)ను ప్రాక్టీస్‌ చేశాడు. రికార్డు నమోదు తర్వాత ప్లాంకింగ్‌కు తాను రిటైర్మెంట్‌ పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2011లో తొలిసారి ప్లాంకింగ్‌ను ఎంచుకున్న ఈ అమెరికా వృద్ధ సంచలనం ప్రపంచ రికార్డు ఫీట్‌కు ముందు ప్రతి రోజు ఏడు గంటల పాటు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. ‘గత కొన్నేండ్లుగా నేను చేస్తున్న శ్రమకు తగిన ఫలితం దక్కింది. నిర్విరామంగా కదలకుండా ఉండటమంటే మామూలు విషయం కాదు. దీనికి చాలా కఠోర శ్రమ కావాలి. వాన్‌ హలెన్‌, మోట్లె క్రూ, డీప్‌ పర్పుల్‌ లాంటి రాక్‌ అండ్‌ రోల్‌ వీడియోలు నన్ను ప్రభావితం చేశాయి’ అని జార్జ్‌ అన్నాడు. 


logo
>>>>>>