గురువారం 21 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 00:30:26

కంగారూలకావరం

కంగారూలకావరం

  • మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలకు దిగిన ఆసీస్‌ అల్లరిమూక
  • భారత ఆటగాళ్లకు సీఏ క్షమాపణలు 
  • విచారణ వేగవంతం

అహంకారం తలకెక్కడమో.. మద్యం మత్తో కానీ కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు హద్దులు మీరారు. ఆతిథుల్లా గౌరవించాల్సిన భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలకు తెగబడ్డారు. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని ఆసీస్‌ అల్లరిమూక రెచ్చిపోయింది. ఇప్పటికే ఈ విషయమై భారత బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ కొందరు ఆకతాయిలు దూషణలు కొనసాగించడంతో వివాదం ముదిరింది. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌, కెప్టెన్‌ రహానే ఫిర్యాదుతో కొందరిని భద్రతా సిబ్బంది స్టేడియం నుంచి బయటకు పంపడంతో నాలుగో రోజు ఆటకు ఆటంకం కలిగింది. భారత ప్లేయర్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా క్షమాపణ చెప్పగా.. ఆసీస్‌ ఫ్యాన్స్‌ తీరును క్రికెట్‌ ప్రపంచం దుమ్మెత్తిపోస్తున్నది. 

సిడ్నీ: జాత్యహంకార వివాదం తీవ్రమైంది. సిడ్నీ టెస్టు లో కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు రౌడీ ప్రవర్తనతో భారత ఆటగాళ్లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగించారు. మూడో రోజు ఆటలో తమ పేసర్లు సిరాజ్‌, బుమ్రాను దూషించారని మ్యాచ్‌ రిఫరీ బూన్‌కు బీసీసీఐ ఫిర్యాదు చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే కొందరు ఆసీస్‌ ఫ్యాన్స్‌ మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. ఆదివారం నాలుగో రోజు రెండో సెషన్‌లో బౌండరీ దగ్గర నిలబడ్డ సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆరుగురు ప్రేక్షకులను స్టేడియం నుంచి వెళ్లగొట్టారు. దీంతో 10 నిమిషాల ఆట నిలిచిపోయింది. 

ఇది కొత్తేం కాదు

సిడ్నీలో ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగినా.. ఇప్పుడు శ్రుతి మించాయి. మరోవైపు భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. జాత్యహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఐసీసీ తేల్చిచెప్పింది. 2008లో సైమండ్స్‌ను తిట్టాడో లేదో తెలియకముందే హర్భజన్‌పై నిందలు మోపి ‘మంకీగేట్‌'వివాదంలో రచ్చ చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఇప్పుడు జాత్యంకారంలో పరాకాష్టకు చేరిన సొంత అభిమానులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

ఇక సహించబోం: బీసీసీఐ 

భారత క్రికెటర్లపై ఆసీస్‌ అభిమానుల జాత్యంహంకార వ్యాఖ్యలపై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. ఇక ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరికలు చేసింది. సమాజం, క్రీడల్లో జాత్యహంకారానికి తావు ఉండకూడదని వ్యాఖ్యానించింది. ‘నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సూచించాం. ఈ విషయంలో రెండు బోర్డులు సమిష్టిగా ఉంటాయి. వివక్షాపూరితమైన ఇలాంటి చర్యలను ఇక సహించేది లేదు’అని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశారు. కాగా ఆస్ట్రేలియా ప్రేక్షకుల్లోని కొందరు సిరాజ్‌ను బ్రౌన్‌ డాగ్‌, బిగ్‌ మంకీ అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఉక్కుపాదం మోపాల్సిందే

నేను నాలుగోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చా. ముఖ్యంగా సిడ్నీలోనే ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాం. గతంలోనూ మమ్మల్ని దూషించి, ఇబ్బంది పెట్టారు. ఈసారి హద్దులు మీరి జాత్యహంకార వ్యాఖ్యలకు దిగారు. ఇలాంటి ఘటనలపై ఉక్కుపాదం మోపి మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలి. 

- అశ్విన్‌

రౌడీల కంటే దారుణమైన ప్రవర్తన 

జాత్యహంకార దూషణలను తీవ్రంగా ఖండించాలి. ఇది రౌడీల ప్రవర్తనకు పరాకాష్ట. ఈ విషయంపై విచారణ జరపాలి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు నా గురించి, నా మతం గురించి, నా వర్ణం.. ఇలా చాలా విషయాల్లో అక్కడి ప్రేక్షకులు మాట్లాడడం నేను విన్నా.   

- విరాట్‌ కోహ్లీ 

క్షమించండి.. కఠిన చర్యలు తీసుకుంటాం

భారత క్రికెటర్లకు క్షమాణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. వారిపై ఆంక్షలు విధించాలని పోలీసులకు ప్రతిపాదిస్తాం.

- క్రికెట్‌ ఆస్ట్రేలియా 

ఇలా అయితే రావొద్దు

సిడ్నీలో జరుగుతున్నది చూస్తుండడం దురదృష్టకరం. ఇలాంటి చెత్తకు చోటు ఉండకూడదు. ఆట చూడాలని లేకున్నా.. గౌరవంగా ఉండలేమనుకున్నా దయచేసి మైదానాలకు రావొద్దు. క్రికెట్‌ వాతావరణాన్ని చెడగొట్టొద్దు. 

- వీవీఎస్‌ లక్ష్మణ్‌ 

జాత్యహంకారాన్ని ఉపేక్షించబోం

సిడ్నీ మైదానంలో జరిగిన జాత్యహంకార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో విచారణ చేసేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు పూర్తి సహకారం అందిస్తాం. ఆటలో వివక్షకు తావులేదు. కొందరు అభిమానులు చేసిన పనికి చాలా బాధపడుతున్నాం.

- ఐసీసీ 

ప్రతీసారి ఏదో ఒకటి

ఆస్ట్రేలియాలో ఆడేందుకు వెళ్లిన ప్రతీసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతున్నది. ఇవి సాధారణమైపోయాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ఐసీసీ త్వరగా ఈ విషయంలో కల్పించుకోవాలి.

- అజారుద్దీన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు


logo