శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 21, 2020 , 01:40:49

జోరుగా క్రీడాభివృద్ధి

జోరుగా క్రీడాభివృద్ధి

 • జీహెచ్‌ఎంసీ పరిధిలో 97 కోట్లతో స్టేడియాల నిర్మాణం

అత్యుత్తమ ఫలితాలు రావాలంటే.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలనే దూరదృష్టితో.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం దిగ్విజయంగా కొనసాగుతున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు.. నియోజక వర్గానికో మినీ స్టేడియాన్ని నిర్మించడంతో పాటు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించేందుకు ఇండోర్‌ స్టేడియాలను తీర్చిదిద్దుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని క్రీడారంగం.. స్వపరిపాలనలో సగర్వంగా దూసుకెళ్తున్నది. దేశానికే తలమానికంలా నిలిచే క్రీడా పాలసీని రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మించిన క్రీడా నిర్మాణాలపై ఓ లుక్కేస్తే.. 


నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి, సిటీబ్యూరో: క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. క్రీడల్లో దేశానికి దిక్సూచిలా రాష్ర్టాన్ని మార్చేందుకు క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ర్టాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న దృఢసంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యాధునిక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇండోర్‌ స్టేడియాలు, మైదానాలు, జిమ్‌లను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటి వరకు రూ.97.37 కోట్లతో జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15 నిర్మాణాల్లో 6 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో రూ.31.62 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. మౌలిక వసతులు మెరుగుపడితే మరింత మందిని వెలుగులోకి తీసుకురావచ్చనే ఉద్దేశంతో స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిభ కలిగిన యువకులను గుర్తించడం, వారికి మెరుగైన శిక్షణ ఇప్పించి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంచుకున్నది. ప్రతి ఏడాది జీహెచ్‌ఎంసీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నది. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్లేయర్లకు అవకాశం లభిస్తున్నది.  

సనత్‌నగర్‌ @ మల్టీపర్పస్‌

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఇటీవలే సనత్‌ నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభమైంది. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కాంప్లెక్స్‌ ఇండోర్‌ గేమ్స్‌కు నిలయంగా మారింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన కాంప్లెక్స్‌లో బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, రెజ్లింగ్‌తో పాటు జిమ్‌ సౌకర్యాలను ప్లేయర్లకు అందుబాటులోకి తెచ్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ ఇండోర్‌ స్టేడియంలో పురుషుల, మహిళలకు వేర్వేరుగా జిమ్‌, యోగా సాధన చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. దీంతో పాటు ఆదయ్య నగర్‌  కేపీహెచ్‌బీ, వసంత్‌ నగర్‌లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. 

క్రీడా కాంప్లెక్స్‌లను సులువుగా అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ‘పే అండ్‌ ప్లే’ స్కీమ్‌ను జీహెచ్‌ఎంసీ తీసుకొచ్చింది. ఇందులో విద్యాసంస్థలతో పాటు ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, యువకులు, మహిళలు ప్రత్యేకమైన యాప్‌ ద్వారా తమకు నచ్చిన క్రీడ కోసం డబ్బులు చెల్లించి అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. 


ప్రభుత్వ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఇండోర్‌ స్టేడియాలకు తోడు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌, కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, ఉస్మానియా తదితర ప్రాంతాల్లో ప్లేయర్లకు క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బ్యాడ్మింటన్‌ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో గోపీచంద్‌, జ్వాలా గుత్తా, సానియా మీర్జా అకాడమీ, గగన్‌ నారంగ్‌ షూటింగ్‌ రేంజ్‌లు, ప్రైవేట్‌ క్రికెట్‌ అకాడమీలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది క్రీడా షెడ్యూల్‌కు ఆటంకం కలుగగా, ఇప్పుడిప్పుడే టోర్నీలు మొదలవుతున్నాయి. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు నగరవాసులు ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ చాలా మంది మైదానాలకు తరలి వస్తున్నారు. 

నగర పరిధిలో క్రీడా నిర్మాణాలు...

 • ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియం (వనస్థలి పురం) 
 • ఆంధ్రా బ్యాంక్‌ కాలనీ(గడ్డి అన్నారం) 
 • సిరిపురం కాలనీ(ఆర్టీవో ఆఫీస్‌) 
 • మొగల్‌పుర స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌
 • సనత్‌ నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
 • కేపీహెచ్‌బీ రమ్య ప్లేగ్రౌండ్‌(వార్డ్‌ ఆఫీస్‌ దగ్గర) 
 • వసంత్‌ నగర్‌ 
 • కేపీహెచ్‌బీ ఫేజ్‌-4 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
 • గాయత్రి నగర్‌ ఇండోర్‌ స్టేడియం(అల్లాపూర్‌) 
 • గాంధీ నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
 • లాలాపేట్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
 • ఆదయ్య నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
 • ఫుట్‌బాల్‌ స్టేడియం అభివృద్ధి(బార్కస్‌) 
 • ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, జియాగూడ 
 • ఇండోర్‌ గేమ్‌ ఫెసిలిటీ సెంటర్‌, ఆర్‌కే నగర్‌, మల్కాజిగిరి సర్కిల్‌ 
 • స్విమ్మింగ్‌పూల్‌, గోల్కొండ 
 • స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (ఇండోర్‌ హాల్‌), ఖాజాగూడ, శేరిలింగంపల్లి. 


నగరంలో ఉన్న మైదానాల వివరాలు..

 • ప్లే గ్రౌండ్స్‌-521 
 • స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు- 21 
 • స్విమ్మింగ్‌ పూల్స్‌- 7 
 • టెన్నిస్‌ కోర్టులు- 5 
 • స్కేటింగ్‌ రింక్స్‌-12 
 • ఇంటర్నేషనల్‌ బ్యాకింగ్‌ ట్రాక్‌-1 
 • మోడ్రన్‌ జిమ్‌లు - 135