శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 00:39:49

జోరు సాగాలి

జోరు సాగాలి

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయంతో టీ20 ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించిన భారత మహిళల జట్టు.. ఏ మాత్రం అంచనాల్లేని బంగ్లాదేశ్‌తో సవాల్‌కు రెడీ అయింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలర్లు రాణించడంతో గట్టెక్కిన హర్మన్‌ బృందం ఈసారి బ్యాట్‌ ఝళిపించాలని పట్టుదలగా ఉంది. 2018 ఆసియా కప్‌లో తమకు రెండుసార్లు షాకిచ్చిన బంగ్లాను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని అనుకుంటున్నది. ఈ పోరులో గెలిస్తే నాకౌట్‌కు చేరువయ్యే అవకాశం ఉండటంతో ఏ మాత్రం పట్టు సడలనివ్వకూడదని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగనుంది.

  • బంగ్లాదేశ్‌తో నేడు భారత్‌ పోరు గెలిస్తే నాకౌట్‌ పక్కా..!
  • మహిళల టీ20 ప్రపంచకప్‌

పెర్త్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో రెండో పోరాటానికి భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. సోమవారం ఇక్కడి వాకా మైదానంలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్‌-ఏలో ఉన్న మన జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్‌ దశకు దగ్గరైనట్టే. గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగి తక్కువ పరుగులే చేసినా.. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మ్యాజిక్‌తో ఆసీస్‌పై విజయం సాధించిన హర్మన్‌ గ్యాంగ్‌.. బంగ్లాతో పోరులో బ్యా టింగ్‌లో రాణించాలని పట్టుదలగా ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తే భారీ లక్ష్యాన్ని నిర్దేశించి బౌలర్ల పని సులువు చేయాలని భావిస్తున్నది. 2018 టీ20 ఆసియా కప్‌లో రెండుసార్లు ఓడించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అనుకుంటున్నది. మరో వైపు బంగ్లాదేశ్‌ విశ్వకప్‌లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నది.


బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిందే..

ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత బ్యాటింగ్‌లో నిలకడ లేమి కొట్టొచ్చినట్టు కనిపిచింది. విశ్వటోర్నీ తొలి మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాపై మన బ్యాటర్లు తడబడ్డారు. టాపార్డర్‌లో షెఫాలీ వర్మ దూకుడుగా ఆడగా.. చివర్లో దీప్తిశర్మ నిలువడంతో టీమ్‌ఇండియా ఓ మోస్తరు స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ క్రీజులో కుదురుకున్నా.. కీలకదశలో ఔటైంది. ఈ తరుణంలో బంగ్లాతో మ్యాచ్‌లో లోపాలు సరిదిద్దుకొని సమిష్ఠిగా రాణించాలని భారత అమ్మాయిలు తహతహలాడుతున్నారు. ఫామ్‌లోనే ఉన్న స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన సహా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ చెలరేగితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు.


మళ్లీ తిప్పాల్సిందే.. 

పటిష్ఠ ఆసీస్‌ పని పట్టిన మన బౌలర్లు టోర్నీ చివరి వరకు జోరు కొనసాగించాల్సిన అవసరముంది. గత మ్యాచ్‌లో పూనమ్‌ యాదవ్‌ దుమ్మరేపగా.. మీడియం పేసర్‌ శిఖా పాండే సైతం రాణించింది. తెలుగుమ్మాయి అరుంధతీ రెడ్డి భారీగా పరుగులిచ్చుకోవడం మేనేజ్‌మెంట్‌ను ఇబ్బంది పెడుతున్నది. మరో స్పిన్నర్‌ దీప్తిశర్మ పొదుపైన బౌలింగ్‌ను కొనసాగించి బంగ్లా బ్యాటర్లను ఆది నుంచే కట్టిడి చేసేందుకు సిద్ధమైంది.


అనుభవజ్ఞులతో..

కెప్టెన్‌ సల్మా ఖాతున్‌, ఆల్‌రౌండర్‌ జొహనర ఆలం, టాపార్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ ఫర్గాన హక్‌ లాంటి అనుభవజ్ఞులతో బంగ్లాదేశ్‌ జట్టు కూడా బలంగానే ఉంది. హక్‌ ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో ఓ శతకం బాదగా.. 2018 టీ20 ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించడంలోనూ కీలకపాత్ర పోషించింది. కెప్టెన్‌ సల్మా కూడా బ్యాట్‌, బంతితో అదరగొట్టాలని ఆశిస్తున్నది.  టీమ్‌ఇండియా స్పిన్నర్లను బంగ్లా బ్యాటర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.


నికెర్క్‌ ఆల్‌రౌండ్‌ షో 

మెగాటోర్నీలో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్కీవర్‌ (50) అర్ధశతకంతో ఆకట్టుకుంది. సఫారీ బౌలర్లలో అయబోంగా ఖాక 3.. నికెర్క్‌, మరిజానే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్‌ నికెర్క్‌ (46), మరిజానే (38) ఆకట్టుకోవడంతో.. దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసింది.


ఆసీస్‌తో విజయంతో మేం మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు. ఎందుకంటే టోర్నీలో ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది. విజయాలను పునరావృతం చేసేందుకు బంగ్లాతో సహా ప్రతీ మ్యాచ్‌లోనూ పూర్తిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో మంచి స్కోరు చేసి బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేయాలి. 

-వేదకృష్ణమూర్తి


logo