మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 16:27:19

రైనా నిష్క్రమణ..అసలు కథ ఇదీ..!

రైనా నిష్క్రమణ..అసలు కథ ఇదీ..!

న్యూఢిల్లీ:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా అర్ధంతరంగా యూఏఈ నుంచి స్వదేశానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపాడు. వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం జరిగిందని చెప్పాడు. స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్‌ వదిలిరావడానికి గల కారణాలేంటో వివరించాడు.  యూఏఈలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బయో సెక్యూర్‌ బబుల్‌ను విడిచిపెట్టడానికి వ్యక్తిగత, తన కుటుంబం గురించి     ఆందోళనే  ప్రధాన కారణం  స్పష్టం చేశాడు. 

'ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.  ఇలాంటి ఏర్పాట్లు ఇంతకుముందెన్నడూ చేయలేదు. ఇది అందరికీ కొత్తే.  ఇది అత్యంత సురక్షితమైన వాతావరణం. యాక్సెస్‌ లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు. మరో మనిషితో సంబంధం లేకుండా మేమంతా మా గదుల్లోనే ఉన్నాం.  అలాగే ప్రతిరెండు రోజులకు ఒకసారి కరోనా పరీక్ష ఉంటుందని'  క్రిక్‌బజ్‌తో రైనా అన్నాడు.

తనకు ఏదైనా జరిగితే తన కుటుంబానికి  ఏం జరుగుతుందోనని ఆందోళన చెందానని,  అందుకే ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని రైనా  వెల్లడించాడు. 

'నాకొక కుటుంబం ఉంది. ఒకవేళ నాకేమైనా అయితే వాళ్ల  పరిస్థితేంటీ?. నాకు నా కుటుంబమే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో నేను వారి గురించి ఆందోళనకు గురయ్యాను. 20రోజుల నుంచి నా పిల్లలను చూడలేదు. నేను  స్వదేశానికి తిరిగొచ్చినప్పటికీ నేను క్వారంటైన్‌లోనే ఉన్నానని' రైనా చెప్పాడు. 


logo