సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 18, 2020 , 01:24:39

ఇంకా సమయం ఉంది

ఇంకా సమయం ఉంది

ఆకస్మిక నిర్ణయాలు అవసరం లేదు: ఐఓసీ

లుసానే: టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యేందుకు ఇంకా 4నెలల సమయం ఉందని, అందుకే తక్షణమే ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అభిప్రాయపడింది. అథ్లెట్లు సాధ్యమైనంతగా విశ్వక్రీడలకు సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించేందుకు ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశాన్ని మంగళవారం ఇక్కడ నిర్వహించింది. ‘టోక్యో ఒలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించేందుకు ఐఓసీ పూర్తి పట్టుదలతో ఉంది. క్రీడలు జరిగేందుకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఈ తరుణంలో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రపంచం మొత్తం ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నది. ఒలింపిక్స్‌ ఏర్పాట్లను సైతం కరోనా వైరస్‌ ప్రభావితం చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల వైరస్‌ తగ్గు ముఖం పడుతుందని ఆశిస్తున్నాం’ అని సమావేశం అనంతరం ఐఓసీ ప్రకటించింది. 


ప్రాక్టీస్‌ కొనసాగించండి

ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలు వాయిదా లేదా రద్దవుతుండడంపైనా ఐఓసీ స్పందించింది. ఇప్పటికే 57శాతం మంది అథ్లెట్లు విశ్వక్రీడలకు అర్హత సాధించారని, మిగిలిన వారిని ఎంపిక చేసేందుకు అవసరమైతే క్వాలిఫికేషన్‌ సిస్టంలో సర్దుబాట్లు చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఐఓసీ ప్రకటించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లందరూ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది. కాగా, మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,400మందికి పైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. 


logo