బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:27:13

చక్‌దే ఆదిలాబాద్‌

చక్‌దే ఆదిలాబాద్‌

  • జాతీయ స్థాయి హాకీలో రాణిస్తున్న కొలాం క్రీడాకారులు 
  • ఆశ్రమ పాఠశాల నుంచి అంచెలంచెలుగా సాయ్‌ ఎంపికలోనూ సత్తా

ఆదిలాబాద్‌ అడవులకు ప్రసిద్ధి. దట్టమైన అరణ్యాలతో  అలరారే తెలంగాణ కశ్మీరం అందాలకు నెలవు. అడవి బిడ్డలతో కళకళలాడే ఈ జిల్లా క్రీడల్లోనూ సై  అంటున్నది. ఆదివాసీ జాతుల్లో ఒకటైన కొలాం కుర్రాళ్లు...హాకీలో కుమ్మెస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల వేదికగా తమ ఆటకు మెరుగులు దిద్దుకుంటూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అదరగొడుతున్నారు. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో దూసుకెళుతూ హాకీకీ ఆదిలాబాద్‌ను అడ్డాగా మారుస్తున్నారు. జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో సత్తాచాటుతూ జాతీస్థాయికి ఎదిగిన కొలాం హాకీ క్రీడాకారులపై ప్రత్యేక  కథనం. 

ఆదిలాబాద్‌ రూరల్‌:  ఆదిలాబాద్‌ అంటేనే అడవుల జిల్లా. మిగ తా తెలంగాణ జిల్లాలతో పోలిస్తే అటవీ విస్తీర్ణం ఇక్కడ ఎక్కువ. ఆదివాసీ తెగల్లో ఒకటైన కొలాం జాతి వాసుల పరిస్థితి మిగతావారి కంటే వెనుకబడి ఉంది. ఈ కారణంగా వీరిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో కొలాం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది వీరికి బాగా కలిసొచ్చింది. అడవుల్లో నిరంతరం సంచరిస్తుండటం వల్ల మిగతావారి కంటే వీరు సహజంగానే ధృడంగా ఉంటారు. వీరి శారీరక తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు కొలాం కుర్రాళ్లకు హాకీలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.  

అంచెలంచెలుగా 

కొలాం విద్యార్థుల సహజసిద్ధ లక్షణాలను గమనించిన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు హాకీలో వారిని సానబెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్లు మెరికల్లాంటి విద్యార్థులను గుర్తించి కఠోర శిక్షణ ఇచ్చారు. పాఠశాలకు చెందిన కొరెడ్డి  పార్థసారథి.. విద్యార్థులను దగ్గరలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిరంతరం శిక్షణ ఇచ్చారు. రోజురోజుకు తమ ప్రతిభకు పదును పెట్టుకుంటూ కొలాం విద్యార్థులు ముందుకు సాగారు. దీనికి తోడు జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పాల్గొంటూ ప్రత్యర్థి జట్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్థసారథికి తోడు సీనియర్‌ క్రీడాకారులు డేవిడ్‌, జాదవ్‌ రవిందర్‌ హాకీలో శిక్షణనివ్వడం వీరికి బాగా కలిసొచ్చింది. అందుబాటులో ఉన్న సౌకర్యాలతో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగారు. 

హాకీలో పతకాల పంట  

కొలాం క్రీడాకారులు అనతి కాలంలోనే హాకీలో మెళకువలు నేర్చుకున్నారు. ప్రతి రోజు ఉపాధ్యాయుల సమక్షంలో గంటల తరబడి కఠోరంగా సాధన చేశారు. వీరు  రాష్ట్ర స్థాయిలో ఏ పోటీకెళ్లినా..కచ్చితంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇలా టోర్నీ ఏదైనా..టైటిల్‌, పతకాలతో తిరిగి రావడం వీరికి పరిపాటిగా మారింది. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగే  అండర్‌-14, 17, 19 రాష్ట్ర స్థాయి టోర్నీల్లో వీరి బరిలోకి దిగుతున్నారంటే.. మిగతా జట్లకు దడపుడుతున్నది.

సాయ్‌ సెంటర్‌కు ఎంపిక

కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తూ హాకీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌)కు ఎంపికయ్యారు. సాయ్‌లో ఆదిలాబాద్‌ నుంచి ఎంపికైన ఏడుగురు ఈ పాఠశాలకు చెందిన వారే కావడం విశేషం.  హైదరాబాద్‌ సాయ్‌ సెంటర్‌లో గజానన్‌, రాంకుమార్‌, నర్సింగ్‌, పరమేశ్వర్‌, నగేశ్‌ ఉన్నారు. సాయ్‌ మహబూబ్‌నగర్‌ సెంటర్‌లో భీంరావ్‌, కిరణ్‌ శిక్షణ తీసుకుంటున్నారు.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు...

గజానన్‌ , రాంకుమార్‌, కుర్సెంగే నర్సింగ్‌,  పరమేశ్వర్‌, నగేశ్‌, భీంరావ్‌, పెందూర్‌ కిరణ్‌, శ్రీహరి, జంగు, కిరణ్‌, వినోద్‌, జ్ఞానేశ్వర్‌, కొడప ప్రదీప్‌, శ్రీహరి, జంగు, రాథోడ్‌ లోకేష్‌, ముకుంద్‌రావ్‌, సూర్యారావు, సుదర్శన్‌, వినోద్‌, రా మ్‌ జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. 

అత్యుత్తమ ప్రదర్శన  

 2017 - ఆదిలాబాద్‌లో జరిగిన అండర్‌-14 రాష్ట్రస్థాయి పోటీలో ప్రథమ స్థానం

2019 - జూనియర్స్‌లో ద్వితీయ స్థానం

2019 - వనపర్తిలో జరిగిన అండర్‌-17 హాకీ పోటీల్లో ప్రథమ స్థానం 

2019 - సబ్‌జూనియర్‌  హాకీ పోటీల్లో తృతీయ స్థానం.

2019 - స్కూల్‌గేమ్స్‌  ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌-17 టోర్నీలో ద్వితీయ స్థానం

2020 - హైదరాబాద్‌లో  జరిగిన రాష్ట్రస్థాయి సొసైటీ లీగ్‌ హాకీ పోటీల్లో ప్రథమ స్థానం.  


logo