ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 18, 2020 , 00:14:56

సీఎం టీ-10 కప్‌ విజేత ప్రెస్‌క్లబ్‌

 సీఎం టీ-10 కప్‌ విజేత ప్రెస్‌క్లబ్‌
  • ఫైనల్లో టీఎన్‌జీవోపై ఉత్కంఠ విజయం..
  • క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు..
  • ఎల్బీ స్టేడియంలో పండుగ వాతావరణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 66వ పుట్టిన రోజును పురస్కరించుకుని అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. సోమవారం ఎల్బీ స్టేడియం వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సీఎం టీ-10 కప్‌ ఫైనల్లో ప్రెస్‌క్లబ్‌ జట్టు మూడు పరుగుల తేడాతో టీఎన్‌జీవోపై అద్భుత విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ప్రెస్‌క్లబ్‌ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లకు 79 పరుగులు చేసింది. టీఎన్‌జీవో బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ మణి(32 బంతుల్లో 51 పరుగులు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీఎన్‌జీవో జట్టు 7 వికెట్లకు 76 పరుగులకు పరిమితమైంది. శేఖర్‌ మూడు వికెట్లతో రాణించాడు. విజేత, రన్నరప్‌ ట్రోఫీలను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాలీవుడ్‌ తల్వార్స్‌ జట్టు విజయం సాధించింది. ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, గ్యాదరి కిషోర్‌, సైది రెడ్డి, జీవన్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆకట్టుకున్నారు.  


క్రీడాకారులకు సన్మానం 

తెలంగాణ తరఫున జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసిన క్రీడాకారులను రాష్ట్ర క్రీడా శాఖ ఘనంగా సన్మానించింది. ఇటీవలి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన 21 క్రీడాకారులకు తోడు పలు అంతర్జాతీయ టోర్నీల్లో రాణించిన 80 మందికి క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డి, అథ్లెట్లు దీప్తి, నందిని, చెస్‌ క్రీడాకారుడు భరత్‌కోటి సన్మానం పొందిన వారిలో ఉన్నారు. 


మొక్కలు నాటి, రక్తదానం చేసి: 

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు సోమవారం ఉదయం ఒలింపిక్‌ భవన్‌ పరిసరాల్లో క్రీడాకారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి దివ్యాంగ క్రీడాకారులకు ఇండియన్‌ క్రిస్టియన్‌ మిషన్‌ సంస్థ సహాయం చేసిన వీల్‌చైర్లను మంత్రి అందజేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  logo