గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 08, 2020 , 00:46:51

హెచ్‌సీఏలో వర్గ విభేదాలు

హెచ్‌సీఏలో వర్గ విభేదాలు

  ఉప్పల్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో వర్గ విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మను నియమించడంతో రాజుకున్న అభిప్రాయభేదాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు  మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఒక వర్గంగా ఏర్పడగా, కార్యదర్శి విజయానంద్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌ వైరి వర్గంగా మారారు. తమను సంప్రదించకుండా అంబుడ్స్‌మన్‌ను నియమించడంపై గుర్రుగా వున్న అజర్‌ వ్యతిరేక వర్గం...అంతే దీటుగా స్పందిస్తున్నది. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, దూషించారని పేర్కొంటూ హెచ్‌సీఏ చీఫ్‌ అజర్‌ ఆదివారం ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోశాధికారి సురేందర్‌తో పాటు అసోసియేషన్‌ సభ్యుడు మోయిజుద్దీన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై సురేందర్‌, మోయిజుద్దీన్‌ను విచారిస్తున్న సమయంలో అజర్‌ వర్గం రాజీ కోసం ప్రయత్నించడంతో రచ్చ మొదలైంది. తనను దూషించారంటూ అంపైర్‌ యూసుఫ్‌  సమాచారంతో అజర్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది కేవలం ఉద్యోగుల మధ్య వివాదం మాత్రమేనని, క్రికెట్‌ అభివృద్ధి కోసం ముందుకెళ్లడమే తన లక్ష్యమని అజర్‌ వివరణ ఇచ్చారు.  


logo