శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 16:04:52

ఐపీఎల్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డు.. క్రిస్‌ మోరిస్‌కు రూ.16.25 కోట్లు

ఐపీఎల్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డు.. క్రిస్‌ మోరిస్‌కు రూ.16.25 కోట్లు

చెన్నై: సౌతాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచ‌ల‌నం సృష్టించాడు. అత‌డు ఏకంగా రూ.16.25కోట్ల‌కు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ అత‌న్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అత‌ని కోసం ముంబై, బెంగ‌ళూరు, పంజాబ్, రాజ‌స్థాన్ ఫ్రాంచైజీలు పోటీ ప‌డి బిడ్లు దాఖ‌లు చేశాయి. కేవ‌లం రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన మోరిస్‌.. చివ‌రికి రికార్డు ధ‌ర ప‌ల‌క‌డం విశేషం.  ఐపీఎల్ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ ఏ ప్లేయ‌ర్ ఈ ధ‌ర ప‌ల‌క‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ యువ‌రాజ్ రూ.16 కోట్ల‌తో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డు కూడా మ‌రుగున ప‌డిపోయింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఓ విదేశీ ప్లేయ‌ర్‌కు గ‌తంలో రూ.15.5 కోట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఆస్ట్రేలియా బౌల‌ర్ క‌మిన్స్‌ను ఈ భారీ మొత్తానికి కోల్‌క‌తా కొనుగోలు చేసింది. మోరిస్ ఆ రికార్డును కూడా తిర‌గ‌రాశాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.14.25 కోట్లు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం డిమాండ్ త‌గ్గ‌లేదు. గ‌త సీజ‌న్‌లో అత‌నికి ప‌ది కోట్లు ఇచ్చినా పంజాబ్ త‌ర‌ఫున దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. టోర్నీ మొత్తంలో క‌నీసం ఒక్క సిక్స్ కూడా బాద‌లేదు. దీంతో ఆ టీమ్ అత‌న్ని వ‌దిలేసింది. కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. అత‌ని కోసం బెంగ‌ళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి బెంగ‌ళూరే అత‌న్ని రూ.14.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 

మోయిన్ అలీకి రూ.7 కోట్లు

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ మోయిన్ అలీ కోసం కూడా చెన్నై, పంజాబ్ మ‌ధ్య పోటీ బాగానే న‌డిచింది. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో అత‌ను వేలంలోకి రాగా.. ఈ రెండు ఫ్రాంచైజీలు బిడ్‌ను పెంచుతూ వెళ్లాయి. చివ‌రికి రూ.7 కోట్లు పెట్టి చెన్నై అత‌న్ని కోనుగోలు చేసింది.

షకీబుల్ హ‌స‌న్‌కు రూ.3.2 కోట్లు

మ‌రోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్‌ను రూ.3.2 కోట్లు పెట్టి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో అత‌ను వేలంలోకి వ‌చ్చాడు. అత‌ని కోసం కింగ్స్ పంజాబ్ కూడా తీవ్రంగానే ప్ర‌య‌త్నించింది. చివ‌రికి కోల్‌క‌తా అత‌న్ని ద‌క్కించుకుంది.

శివ‌మ్ దూబెకు రూ.4.4 కోట్లు

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబె ఈసారి వేలంలోనూ భారీగానే ధ‌ర ప‌లికాడు. రూ.50 ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అత‌న్ని ఏకంగా రూ.4.4 కోట్ల‌కు రాజ‌స్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మ‌ధ్య‌లో హైద‌రాబాద్ టీమ్ కూడా బిడ్‌వేసినా.. త‌ర్వాత త‌ప్పుకుంది.

స్మిత్‌ను రూ.2.2 కోట్ల‌కు కొన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతి త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన స్మిత్ కోసం ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. మొద‌ట‌గా బేస్‌ప్రైస్ ద‌గ్గ‌ర బెంగ‌ళూరు బిడ్ మొద‌లుపెట్టింది. ఆ వెంట‌నే క్యాపిట‌ల్స్ 2.2 కోట్ల‌కు బిడ్ వేసింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ ముందుకు వెళ్ల‌లేదు. దీంతో స్మిత్‌ను 2.2 కోట్లకు క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది. 

డేవిడ్ మ‌ల‌న్‌కు రూ.1.5 కోట్లు

ఇక ఇంగ్లండ్ ప్లేయ‌ర్‌, టీ20 స్టార్ డేవిడ్ మ‌ల‌న్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ రూ.1.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అత‌న్ని బేస్ ప్రైస్ ద‌గ్గ‌రే పంజాబ్ కొనడం విశేషం. 

ఆడ‌మ్ మిల్నెకు రూ.3.2 కోట్లు

న్యూజిలాండ్ పేస్‌బౌల‌ర్ ఆడ‌మ్ మిల్నె కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. రూ.50 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో వ‌చ్చిన మిల్నెని చివ‌రికి ముంబై ఇండియ‌న్స్ రూ.3.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అత‌ని కోసం మ‌ధ్య‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబ‌ద్ కూడా బిడ్ దాఖ‌లు చేసింది.

రిచ‌ర్డ్‌స‌న్ సంచ‌ల‌నం.. వేలంలో రూ.14 కోట్లు

ఆస్ట్రేలియా యువ పేస్ బౌల‌ర్ జై రిచ‌ర్డ్‌స‌న్ ఐపీఎల్ వేలంలో సంచ‌ల‌నం సృష్టించాడు. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అత‌న్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. ఈ అనామ‌క పేస్ బౌల‌ర్ వేలంలో ఇంత భారీ ధ‌ర ప‌ల‌క‌డం అభిమానులను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. బిగ్ బాష్ లీగ్‌లో అత‌నికి స‌క్సెస్ పేస్‌ బౌల‌ర్‌గా పేరుంది.  మ‌రో ఆస్ట్రేలియ బౌల‌ర్ కూల్ట‌ర్‌నైల్‌ను రూ.5 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది.

షారుక్ ఖాన్‌కు రూ.5.25 కోట్లు

ఐపీఎల్ వేలంలో త‌మిళ‌నాడు బ్యాట్స్‌మ‌న్ మ‌సూద్ షారుక్‌ఖాన్ ఏకంగా రూ.5.25 కోట్ల‌కు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ టీమ్ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి అత‌న్ని కొనుగోలు చేసింది. కేవ‌లం రూ.20 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన షారుక్ కోసం.. ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. కేవ‌లం ఐదు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అత‌డికి ఇంత భారీ మొత్తం రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్యక‌ర‌మే. 

9.25 కోట్ల‌కు అమ్ముడుపోయిన గౌత‌మ్‌

ఐపీఎల్ వేలంలో కిష్ట‌ప్ప గౌత‌మ్ రికార్డు సృష్టించాడు. వేలంలో ఆల్‌రౌండ‌ర్ గౌత‌మ్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించుకున్న‌ది.  గౌత‌మ్‌ను ఆ జ‌ట్టు 9.25 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది.  20 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో గౌత‌మ్‌పై బిడ్డింగ్ స్టార్ట్ అయ్యింది.  కేకేఆర్ జ‌ట్టు అత‌నిపై బిడ్డింగ్‌ను ఓపెన్ చేసింది.  అయితే కేకేఆర్‌, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు .. ఆల్‌రౌండ‌ర్ గౌత‌మ్ కోసం పోటీప‌డ్డాయి.  కానీ చెన్నై జ‌ట్టు 9.25 కోట్ల‌కు గౌత‌మ్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.   విష్ణు వినోద్‌ను ఢిల్లీ జ‌ట్టు 20 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్న‌ది. కేకే రైడ‌ర్స్ 20 ల‌క్ష‌ల‌కు షెల్డ‌న్ జాక్స‌న్‌ను కొనుగోలు చేసింది.  మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌ను 20 ల‌క్ష‌ల‌కు ఆర్‌సీబీ కొన్న‌ది. 

రిలే మెరిడిత్‌కు 8 కోట్లు..

ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల జోరు కొన‌సాగుతోంది.  ఫాస్ట్ బౌల‌ర్ రిలే మెరిడిత్ ఐపీఎల్ వేలంలో 8 కోట్ల‌కు అమ్ముడుపోయాడు.   పంజాబ్ కింగ్స్ లెవ‌న్ ఆ ప్లేయ‌ర్‌ను ఎగురేసుకుపోయింది.  40 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో అత‌నిపై బిడ్డింగ్ స్టార్ట్ అయ్యింది. పంజాబ్‌, ఢిల్లీ జ‌ట్లు.. మెరిడిత్‌ను సొంతం చేసుకునేందుకు వేలంలో తీవ్ర పోటీప‌డ్డాయి.  అయితే అనూహ్య రీతిలో  భారీ ధ‌ర‌కు మెరిడిత్‌ను పంజాబ్ చేజిక్కించుకున్న‌ది.  ఆస్ట్రేలియాలోని బీబీఎల్ టీ20 టోర్నీలో అత‌ను  హ‌రికేన్స్ జ‌ట్టుకు ఆడాడు.   ఢిల్లీ జ‌ట్టు 20 ల‌క్ష‌ల‌కు సిద్ధార్ధ‌ను కొనుగోలు చేసింది. 

కైల్ జేమిస‌న్‌కు 15 కోట్లు

ఐపీఎల్ 2021 వేలంలో న్యూజిలాండ్ క్రికెట‌ర్ కైల్ జేమిస‌న్‌ భారీ ధ‌ర ప‌లికాడు.  ఆల్‌రౌండ‌ర్ జేమిస‌న్‌ను 15 కోట్ల‌కు బెంగుళూరు జ‌ట్టు కొనుగోలు చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను కివీస్ త‌ర‌పున 4 టీ20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌల‌ర్‌గా జేమిస‌న్‌కు మంచి రికార్డు ఉన్న‌ది.  75 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో అత‌నిపై బిడ్డింగ్ సాగింది.  అత‌న్ని సొంతం చేసుకునేందుకు పంజాబ్‌, బెంగుళూరు జ‌ట్లు.. వేలంలో పోటీప‌డ్డాయి. ఇక చ‌తేశ్వ‌ర్ పుజారాను  చెన్నై జ‌ట్టు కేవ‌లం 50 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్న‌ది. 

పియూష్ చావ్లా - రూ.2.4 కోట్లు (ముంబై ఇండియన్స్‌)

ముస్తుఫిజుర్ రెహ‌మాన్ - రూ.కోటి (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌)

ఉమేష్ యాద‌వ్ - రూ.కోటి (ఢిల్లీ క్యాపిట‌ల్స్‌)

VIDEOS

logo