గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 13, 2020 , 16:40:20

IPL 2020: యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ కోలుకున్నాడు..!

 IPL 2020: యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ కోలుకున్నాడు..!

దుబాయ్: అస్వస్థతకు గురైన  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ కోలుకున్నాడు. ఫుడ్‌పాయిజన్‌ కావడంతో  ఆస్పత్రిలో చేరిన గేల్‌ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయ్యాడు. పూర్తిగా కోలుకున్న యూనివర్స్‌ బాస్‌ గేల్‌ తర్వాతి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజాబ్‌ యాజమాన్యం తెలిపింది.  కడుపు నొప్పి నుంచి కోలుకున్న స్టార్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ సోమవారం  మళ్లీ ట్రైనింగ్‌ ప్రారంభించాడని ఫ్రాంచైజీ ట్విటర్లో తెలిపింది.  పూర్తి ఫిట్‌గా ఉన్న గేల్‌  అక్టోబర్‌ 15న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో   బరిలో దిగుతాడని వెల్లడించింది.  

గత వారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు అనారోగ్యంతో గేల్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా జట్టు హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ..' క్రిస్‌గేల్‌ నేటి(SRH) మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది కానీ అతడు అనారోగ్యం బారిన పడ్డాడు.  అతడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అందుకే అతడు తుది జట్టులో లేడని' హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా వ్యాఖ్యాతలతో   చెప్పాడు. కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని పంజాబ్‌   వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. పదమూడో సీజన్‌లో పంజాబ్‌ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది.