బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 10:01:37

క్రిస్ గేల్ ఖాతాలో 1000 టీ20 సిక్స‌ర్లు

క్రిస్ గేల్ ఖాతాలో 1000 టీ20 సిక్స‌ర్లు

హైద‌రాబాద్‌:  క్రిస్టోఫ‌ర్ హెన్రీ గేల్ కొడితే.. బాల్ బ‌య‌ట‌ప‌డాల్సిందే. కండ‌ల వీరుడు భారీ షాట్ల‌తో అల‌రించే రీతి టీ20 క్రికెట్‌లో హైలెట్‌.  బౌల‌ర్ ఎవ‌రైనా.. బంతిని బౌండ‌రీ లైన్ దాటించడ‌మే గేల్ టార్గెట్‌.  బ‌ల‌మైన షాట్ల‌కు గేల్ కేరాఫ్ అడ్ర‌స్‌.  టీ20 ఫార్మాట్‌లో వెయ్యి సిక్స‌ర్లు కొట్టిన తొలి క్రికెట‌ర్‌గా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ త‌ర‌పున ఆడుతున్న గేల్‌.. ఈ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు.  శుక్ర‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 99 ర‌న్స్ కొట్టిన గేల్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్స‌ర్లు ఉన్నాయి.   

సిక్స‌ర్ల జాబితాలో మ‌రో విండీస్ ఆట‌గాడు కీర‌న్ పోలార్డ్ రెండ‌వ ర్యాంక్‌లో ఉన్నాడు.  పోలార్డ్ ఖాతాలో 690 సిక్స‌ర్లు ఉన్నాయి.  ఐపీఎల్ టోర్నీలో ప్ర‌స్తుతం పోలార్డ్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడుతున్నాడు.  ఇక అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన మూడ‌వ ప్లేయ‌ర్‌గా బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ నిలిచాడు. మెక‌ల్ల‌మ్ ఖాతాలో 485 సిక్స‌ర్లు ఉన్నాయి.  ఈ జాబితాలో ఇండియన్ ప్లేయ‌ర్లు ఎవ‌రూ స‌మీపంగా లేరు.   ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో అత్య‌ధికంగా 376 సిక్స‌ర్లు ఉన్నాయి.   

పొట్టి ఫార్మాట్‌లో వెయ్యి సిక్స‌ర్లు బాదిన గేల్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి త‌న‌దైన స్ట‌యిల్‌లో విషెస్ చెప్పింది.  వెయ్యి సిక్స‌ర్లు, ఇంత క‌న్నా చెప్పేది ఏమీలేద‌న్న విష‌యాన్ని త‌న పోస్టులో వెల్ల‌డించింది. ఇక పంజాబ్ టీమ్ ఓన‌ర్ కూడా గేల్ సిక్స‌ర్ల‌పై కామెంట్ చేసింది.