బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 25, 2021 , 13:30:02

హ్యాపీ బ‌ర్త్ డే పుజారా..

హ్యాపీ బ‌ర్త్ డే పుజారా..

ముంబై: ఇండియ‌న్ టీమ్ న‌యా వాల్ చెటేశ్వర్ పుజారా.. సోమ‌వారం త‌న 33వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించిన పుజారా.. ఈసారి రెట్టించిన ఆనందంతో బ‌ర్త్ డేను సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. క్రికెట్‌కు ది వాల్ రాహుల్ ద్ర‌విడ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత అత‌ని స్థానాన్ని నూటికి నూరు శాతం భ‌ర్తీ చేస్తున్న పుజారా.. టెస్ట్ క్రికెట్‌లో త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. అత‌ని బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ రికార్డులేంటో ఒక‌సారి చూద్దాం. 

ఒకే ఇన్నింగ్స్‌లో 525 బంతులు

గంట‌ల త‌ర‌బ‌డి క్రీజులో ఓపిగ్గా నిల‌బ‌డి బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌డం పుజారాకే చెల్లింది. నిజానికి ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా స‌క్సెస్ సాధించ‌డానికి ఒక‌వైపు పుజారా గోడ‌లా నిల‌బ‌డ‌ట‌మే కార‌ణం. ఆసీస్ గ‌డ్డ‌పై వ‌రుస‌గా రెండో టెస్ట్ సిరీస్‌లోనూ వెయ్యికిపైగా బంతులు ఎదుర్కొన్నాడు పుజారా. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక బంతులు ఆడిన రికార్డు కూడా పుజారా పేరిటే ఉంది. 2017లో రాంచీలో జ‌రిగిన టెస్ట్‌లో పుజారా ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 525 బంతులు ఆడి 202 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక ఇండియ‌న్ బ్యాట్స్‌మ‌న్ ఒక ఇన్నింగ్స్‌లో ఆడిన అత్య‌ధిక బంతుల రికార్డు ఇదే. 

ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన రికార్డు

ఒక టెస్ట్‌లో మొత్తం ఐదు రోజులూ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం అనేది చాలా అరుదుగా జ‌రిగే విష‌యం. ఈ ఘ‌న‌త‌ను పుజారా సాధించాడు. 2017లో శ్రీలంక‌తో కోల్‌క‌తాలో జ‌రిగిన టెస్ట్‌లో పుజారా ఈ రికార్డును త‌న పేరిట రాసుకున్నాడు. అత‌ని కంటే ముందే కేవ‌లం ఇద్ద‌రే ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ (ఎంఎల్ జ‌య‌సింహ‌, ర‌విశాస్త్రి) మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. 

సౌతాఫ్రికాలో అత్య‌ధిక రెండో ఇన్నింగ్స్ స్కోరు

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై రెండో ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక స్కోరు చేసిన ఇండియ‌న్ బ్యాట్స్‌మ‌న్ పుజారానే. క‌పిల్ దేవ్ పేరిట 129 ప‌రుగుల‌తో ఉన్న రికార్డును చెరిపేస్తూ.. పుజారా 153 ప‌రుగులు చేశాడు. 

టెస్టుల్లో వేగంగా 1000 ప‌రుగుల్లో రెండోస్థానం

టెస్టుల్లో ఇండియా త‌ర‌ఫున వేగంగా 1000 ప‌రుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు పుజారా. 2013లో హైద‌రాబాద్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో పుజారా ఈ ఘ‌న‌త సాధించాడు. 18వ ఇన్నింగ్స్‌లోనే పుజారా ఈ మార్క్ అందుకున్నాడు. ఈ రికార్డు ఇప్ప‌టికీ వినోద్ కాంబ్లి (14 ఇన్నింగ్స్‌) పేరిటే ఉంది. 

అత‌ని బ‌ర్త్ డే సంద‌ర్భంగా కోహ్లితోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ట్విట‌ర్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు. 

VIDEOS

logo