గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 13:14:27

కోలుకుంటున్న క‌పిల్.. థంబ్స‌ప్ సింబ‌ల్ చూపించిన మాజీ సార‌థి

కోలుకుంటున్న క‌పిల్.. థంబ్స‌ప్ సింబ‌ల్ చూపించిన మాజీ సార‌థి

భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కపిల్‌ను డాక్టర్‌ అతుల్‌ మాథూర్‌ నేతృత్వంలోని వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తున్నది . కపిల్ ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని, ఆయ‌న క్ర‌మంగా క్ర‌మంగా కోలుకుంటున్నారని మాజీ క్రికెట‌ర్ చేత‌న శ‌ర్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక‌ క‌పిల్ ఆసుప‌త్రిలో కూతురితో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో క‌పిల్ థంబ్స‌ప్ సింబ‌ల్ చూపిస్తున్నారు. 

61 ఏళ్ళ క్రికెట‌ర్‌కు  గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హార్ట్‌ దవాఖానలో ఆయనను చేర్పించారు. తొలుత ఛాతిలో నొప్పి అని చెప్పిన వైద్యులు ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు పేర్కొన్నారు.  శుక్రవారం క‌పిల్ ఆరోగ్యంపై  హాస్పిటల్‌ వర్గాలు స్పందిస్తూ ‘కపిల్‌కు గుండెపోటు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఆయనకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చింది.  గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో  యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించినట్లు పేర్కొంది. క‌పిల్ కోలుకున్నార‌ని వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న అభిమానులు, ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.