గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 23:24:59

సూపర్‌ చెన్నై..బోణీ కొట్టిన ధోనీ సేన

సూపర్‌ చెన్నై..బోణీ కొట్టిన ధోనీ సేన

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)  సంప్రదాయానికి భిన్నంగా ఎలాంటి హంగామా లేకుండానే 13వ సీజన్‌   మొదలైంది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌(19.2 ఓవర్లలో ) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.  అంబటి రాయుడు(71: 48 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), డుప్లెసిస్‌(58 నాటౌట్‌: 44 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో  ధోనీసేన సీజన్‌లో బోణీ కొట్టింది. 

163 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన చెన్నైకి శుభారంభం లభించలేదు. ఓపెనర్లిద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. మురళీ విజయ్‌(1), షేన్‌ వాట్సన్‌(4) విఫలమయ్యారు.  ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును రాయుడు, డుప్లెసిస్‌ జోడీ ఆదుకున్నది. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది ఆఖరి వరకు పోరాడారు.  ఈ జోడీ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతోనే చెన్నై అలవోకగా విజయం సాధించింది. ముంబై బౌలర్లలో బౌలింగ్‌ చేసిన ఐదుగురు తలో వికెట్‌ పడగొట్టారు.

ఆ ఇద్దరే..

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై జట్టులో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(33), సౌరభ్‌ తివారీ(42) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది.  టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) విఫలమయ్యాడు. ఆరంభంలో డికాక్‌ వేగంగా ఆడటంతో 4 ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించింది. ముంబై ఇన్నింగ్స్‌ జోరుగా సాగుతుండగా చెన్నై స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్  తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  డీకాక్  కూడా  ఆ తర్వాత ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సౌరభ్‌ చెన్నైబౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లతో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న ముంబైకి జడేజా బ్రేకులు వేశాడు. 

ఒకే ఓవర్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు తివారీ, హార్డిక్‌ పాండ్యను ఔట్‌ చేసి చెన్నై శిబిరంలో ఉత్సాహం నింపాడు. క్రీజులోకి రాగానే పాండ్య రెండు సిక్సర్లు బాది ప్రమాదకరంగా కనిపించాడు. అదే ఓవర్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ కళ్లుచెదిరే క్యాచ్‌లకు వీరిద్దరూ నిరాశగా వెనుదిరిగారు. మ్యాచ్‌లో అదే టర్నింగ్‌ పాయింట్‌. ఇక ఆఖర్లో టెయిలెండర్లు వేగంగా ఆడాలని ప్రయత్నించినా చెన్నై బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు.