బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 19, 2020 , 19:15:52

MIvCSK: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న చెన్నై

MIvCSK: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న చెన్నై

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ యూఏఈలో ఆరంభమైంది.  తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ని రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొంటోంది. లీగ్‌లో ఎక్కువసార్లు టైటిళ్లు నెగ్గిన రెండు జట్ల మధ్య సమరం రసవత్తరంగా ఉండనుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఖాళీ స్టేడియాల్లో అభిమానులు లేకుండానే మ్యాచ్‌ జరుగుతున్నది.  ప్రేక్షకులు, చీర్‌లీడర్ల చిందులు ఇలాంటివేవీ  లేకుండా ఈ ఏడాది ఐపీఎల్‌ వినూత్నంగా జరుగుతున్నది.  టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

చాలా సీజన్లలో తొలుత తడబడిన ముంబై.. అబుదాబి వేదికగా తొలి పోరుతోనే శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌తో యూఏ ఈ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై ఓ అంచనా రానుంది. కాగా అబుదాబి పిచ్‌  బౌలర్లకే అనుకూలించే అవకాశం ఉంది. రోహిత్‌, డికాక్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్య, పొలార్డ్‌, బుమ్రా ఇలా స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ముంబై ఎంతో పటిష్టంగా ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా సీజన్‌ నుంచి తప్పుకోవడం లోటే అయినా చెన్నై  కూడా బలంగానే ఉంది. కెప్టెన్‌ ధోనీ, వాట్సన్‌, రాయుడు, జాదవ్‌, జడేజా లాంటి మ్యాచ్‌ విన్నర్లతో పటిష్టంగానే కనిపిస్తున్నది.