శనివారం 06 జూన్ 2020
Sports - May 23, 2020 , 19:57:32

ఇప్పుడప్పుడే వద్దు: రిజిజు

ఇప్పుడప్పుడే వద్దు: రిజిజు

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో ఎలాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్‌లు నిర్వహించదల్చుకోవడం లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా క్రీడా లోకం స్తంభించిపోగా.. ఇప్పుడిప్పుడే కొత్త మార్గదర్శకాలతో తిరిగి ప్లేయర్లు ప్రాక్టీస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీలైతే ఆ సమయంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించాలనే వాదనలు ఎక్కువయ్యాయి. అయితే క్రీడా టోర్నీలను తిరిగి ప్రారంభించడానికి ముందు శిక్షణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని రిజిజు అన్నారు.

‘క్రీడా కార్యకలాపాలను పునఃప్రారంభించాలంటే అంతకుముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలి. అయితే ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశంలో ఇపపుడప్పుడే ఎలాంటి టోర్నమెంట్‌ నిర్వహించాలనుకోవడం లేదు. ముందు ఈ స్థితికి అలవాటు పడాలి. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఆటలకోసం ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయలేం. అయితే ఒకటి మాత్ర నిజం.. ఇప్పుడు కాకున్నా ఈ ఏడాది ముగిసేలోపు క్రీడల పునరుద్ధరణ జరగడం మాత్రం పక్కా. అథ్లెట్లు తమ పనిలో తాము ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలంలోనూ వాళ్లు ట్రయినర్ల సాయంతో ప్రాక్టీస్‌ కొనసాగించారు’అని రిజిజు అన్నారు.  


logo