గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 02:30:58

ఐపీఎల్‌కు కేంద్రం ఓకే!

ఐపీఎల్‌కు కేంద్రం ఓకే!

  • త్వరలో అధికారిక ఉత్తర్వులు.. ఏర్పాట్లలో తలమునకలైన ఫ్రాంచైజీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌ అధికారి శుక్రవారం వెల్లడించారు. దీంతో అనుకున్న తేదీల్లోనే ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకు దాదాపు మార్గం సుగమమైంది. ‘ఐపీఎల్‌ ఏర్పాట్లపై ముందుకు వెళ్లేందుకు మాకు కావాల్సిన అనుమతులు వచ్చాయి. ఏ సమయంలోనైనా రాతపూర్వక ఉత్తర్వులు వెలువడొచ్చు’ అని ఆ అధికారి చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు బీసీసీఐ నిర్వహించనుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో, కట్టుదిట్టమైన మార్గదర్శకాలతో టోర్నీ సాగనుంది.

ఏర్పాట్లలో ఫ్రాంచైజీలు బిజీ

ఐపీఎల్‌ అనుమతులపై పూర్తి స్పష్టత రావడంతో ఏర్పాట్లలో ఫ్రాంచైజీలు బిజీ అయిపోయాయి. లీగ్‌ కోసం ఈ నెల 20వ తేదీ తర్వాత జట్లను యూఏఈకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. అంతకు ముందు భారత ఆటగాళ్లు, సిబ్బందికి క్వారంటైన్‌, కరోనా పరీక్షల ఏర్పాట్లను చేసే పనుల్లో యాజమాన్యాలు ఇప్పటికే తలమునకలయ్యాయి. కాగా ఆటగాళ్లను ప్రధాన నగరాలకు తీసుకొచ్చే ముందే ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. కాగా బీసీసీఐ ఎస్‌వోపీ ప్రకారం యూఏఈకి బయలుదేరే వారం ముందు ప్రతి 24గంటల వ్యవధిలో ఆటగాళ్లు, సిబ్బందికి ఫ్రాంచైజీలు కరోనా పరీక్షలు చేయించాల్సి ఉంది. 


logo