సోమవారం 13 జూలై 2020
Sports - May 13, 2020 , 22:51:52

స‌చిన్ రికార్డుల‌ను కోహ్లీ చెరిపేస్తాడా?

స‌చిన్ రికార్డుల‌ను కోహ్లీ చెరిపేస్తాడా?

ఇప్పుడే చెప్ప‌లేమ‌న్న పాక్ పేస్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన రికార్డుల‌ను తిరుగ‌రాస్తాడా అంటే.. ఇప్పుడే స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని పాకిస్థాన్ దిగ్గ‌జ పేస‌ర్ వ‌సీం అక్ర‌మ్ అన్నాడు. అయితే స‌చిన్ రికార్డుల‌కు కోహ్లీ ఇంకా చాలా దూరంలో ఉన్నాడ‌ని.. వాళ్లిద్ద‌రిని పోల్చి చూడ‌టం త‌గ‌ద‌ని అక్ర‌మ్ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా నిర్వ‌హిస్తున్న `ఆకాశ‌వాణి` లైవ్ చాట్‌లో అక్ర‌మ్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా స‌చిన్‌, కోహ్లీ ఆట‌తీరుకు సంబంధించి అక్ర‌మ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `నేను మ‌న‌సులో ఒక‌టి పెట్టుకొని బ‌య‌ట‌కు ఒక‌టి చెప్పే ర‌కం కాదు. ఏదైన ఉన్న‌ది ఉన్న‌ట్లే చెప్తాను. స‌చిన్‌, కోహ్లీల‌ను పోల్చ‌డం భావ్యం కాదు. అయితే స‌చిన్ నెల‌కొల్పిన అనేక రికార్డుల‌ను కోహ్లీ తిరుగ‌రాస్తాడా అంటే ఇప్పుడే చెప్పడం తొంద‌ర‌పాటు అవుతుంది. మాస్ట‌ర్ నెల‌కొల్పిన చాలా రికార్డుల‌కు కోహ్లీ ఇంకా దూరంలో ఉన్నాడు. వీరిద్ద‌రి శైలి కూడా భిన్న‌మైన‌ది. ఎంత ఉసిగొల్పినా స‌చిన్ త‌న ప‌ని తాను చేసుకెళ్లే ర‌కం. అదే కోహ్లీ విష‌యానికి వ‌స్తే.. అత‌డు ఎదురుదాడికి దిగుతాడు. అలాంటి స‌మ‌యాల్లోనే అత‌డి వికెట్ తీయ‌డం సులువు` అని అక్ర‌మ్ అన్నాడు. 


logo