శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 30, 2020 , 22:31:18

సీఎస్‌కే షెడ్యూల్‌ ప్రకారం ఆటను ప్రారంభించగలదా? : గంగూలీ

సీఎస్‌కే షెడ్యూల్‌ ప్రకారం ఆటను ప్రారంభించగలదా? : గంగూలీ

ఐపీఎల్‌ స్టార్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లతో సహా పలువురు జట్టు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మొదటిసారిగా స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన సీఎస్‌కే ఐపీఎల్‌ 2020ను ప్రారంభించగలదా.. అనేది చూడాల్సి ఉందని అన్నారు.  

ఈ ఏడాది ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది ఫ్రాంచైజీల ఆటగాళ్లు, సిబ్బంది దుబాయ్, అబుదాబికి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టాయి. సీఎస్‌కే ఆటగాళ్లు మాత్రం ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా ఆ జట్టు స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీకి దూరమయ్యాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ ‘నేను సీఎస్‌కే పరిస్థితిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. షెడ్యూల్ ప్రకారం ఆ జట్టు ఆటను ప్రారంభించగలదా అనేది చూడాలి. ఐపీఎల్ బాగా నిర్వహించబడుతుందని ఆశిస్తున్నా. టోర్నమెంట్ కోసం మాకు సుదీర్ఘ షెడ్యూల్ ఉంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నా’ అని సౌరవ్ గంగూలీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.

‘ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఖాళీ స్టేడియాల్లో ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మేము కూడా ఆ వాస్తవికతను అంగీకరించాలి. నేను పనిచేయడం మొదలుపెట్టాను.. మా పనిని పూర్తి చేస్తాం. నేను కుటుంబం, క్రికెట్, బీసీసీఐ, మీడియా పనుల మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి’ అన్నారు. 

ఇదిలా ఉండగా చాలామంది ఆటగాళ్లు యూఏఈలో తమ జట్లతో ఇంకా చేరలేదు. కరోనా మహమ్మారి మధ్య వీరు ఐపీఎల్‌ ఆడాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo