శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 00:42:19

Dream 11 IPL 7రోజుల్లో చెన్నై చిందేసేనా..

Dream 11 IPL 7రోజుల్లో చెన్నై చిందేసేనా..

పది సీజన్లు.. ఎనిమిది ఫైనళ్లు.. మూడు టైటిళ్లు..ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్ర ఇది.వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా బరిలో దిగే ‘తలా’ గ్యాంగ్‌.. ఈసారి కాస్త ఇబ్బందికర పరిస్థితుల మధ్య లీగ్‌ను ఆరంభించనుంది. ఓ వైపు కరోనా కలకలం.. మరోవైపు సురేశ్‌ రైనా నిష్క్రమణతో డీలాపడ్డ చెన్నైను మాస్టర్‌ మైండ్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఎలా నడిపిస్తాడో చూడాలి!

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నిలకడకు మారుపేరైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీకి అతిపెద్ద బలం సారథి ధోనీ. ఎలాంటి విపత్కర స్థితి నుంచి అయినా జట్టును ఒడ్డుకు చేర్చగల సత్తా ఉన్న మహీ.. ఈసారి మరింత కొత్తగా కనిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మహీ తొలిసారి గ్రౌండ్‌లో దిగనుండగా.. ఇకపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో అతడు మరింత చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనుభజ్ఞులతో కూడిన జట్టు అందుబాటులో ఉండటం మహీకి కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు మూడుసార్లు విజేతగా నిలిచిన ధోనీ సేన.. మరోసారి విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్‌ సరసన చేరాలని భావిస్తున్నది. అయితే లీగ్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టాక జట్టు సిబ్బంది కరోనా బారిన పడటం.. చిన్న తలా సురేశ్‌ రైనా అక్కడి నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి రావడం.. సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ లీగ్‌కు దూరంగా ఉండటం కాస్త ఆందోళన కలింగించే అంశాలు. 

అంతా అనుభవజ్ఞులే..

  చెన్నై శిబిరంలో ఉన్న విదేశీ ఆటగాళ్లతో పాటు.. దేశవాళీ ఆటగాళ్లు కూడా అపార అనుభవజ్ఞులు. ధోనీతో పాటు మురళీ విజయ్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, కరణ్‌ శర్మ, పియూష్‌ చావ్లా, రవీంద్ర జడేజా, డ్వైన్‌ బ్రావో, డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ ఇలా ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉంది. వన్‌డౌన్‌లో రైనా అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, డుప్లెసిస్‌లలో ఎవరో ఒకరు బరిలో దిగొచ్చు. 


logo