బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 21:14:50

మెరిసిన పడిక్కల్‌ ... విఫలమైన కోహ్లీ, డివిలియర్స్‌

మెరిసిన పడిక్కల్‌ ... విఫలమైన కోహ్లీ,  డివిలియర్స్‌

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సాధారణ స్కోరు చేసింది. మెరుపు ఆరంభం దక్కినా.. బ్యాట్స్‌మెన్‌ వరుస విరామాల్లో పెవిలియన్‌ చేరడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.  దేవదత్‌ పడిక్కల్‌(74: 45 బంతుల్లో 12ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకానికి తోడు మరో ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్(33: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌)‌ రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు  164 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(9), డివిలియర్స్‌(15), శివమ్‌ దూబే(2) నిరాశపరిచారు.   ముంబై బౌలర్ బుమ్రా(3/14)   బెంగళూరును వణికించాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, పొలార్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌  పడిక్కల్‌ బ్యాటింగ్‌ జోరు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరోసారి  ఒంటరి పోరాటం చేస్తూ   జట్టును ముందుండి నడిపించాడు.  తొలి ఓవర్‌ నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగి చకచకా పరుగులు రాబట్టాడు. ఫిలిప్‌తో కలిసి  తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. దేవదత్‌ 30 బంతుల్లో 10ఫోర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.  11 ఓవర్లకు బెంగళూరు వికెట్‌ నష్టానికి 93 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. 

అయితే మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడింది.  మధ్య ఓవర్లలో  ముంబై  కట్టడి చేయగలిగింది. బుమ్రా వేసిన 17వ ఓవర్లో శివమ్‌ దూబే, పడిక్కల్‌ను ఔట్‌ చేసి కనీసం ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చివర్లో ఐదు బంతుల్లో బెంగళూరు ౩ వికెట్లు చేజార్చుకుంది. డెత్‌ ఓవర్లలో బెంగళూరును బౌలర్లు కట్టడి చేశారు.   ఆఖర్లో గుర్‌కీరత్‌ సింగ్‌(14 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌(10 నాటౌట్‌) నిలవడంతో స్కోరు 160 దాటింది.