శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 14:13:12

NZvIND: మెరిసిన మన్రో, కేన్‌, టేలర్‌.. కివీస్‌ స్కోరు 203

NZvIND: మెరిసిన మన్రో, కేన్‌, టేలర్‌.. కివీస్‌ స్కోరు 203

మన్రో(59: 42బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), విలియమ్సన్‌(51 :26 4ఫోర్లు, 4సిక్సర్లు), రాస్‌ టేలర్‌(54 నాటౌట్‌: 27 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు కివీస్‌ 203 పరుగులు చేసింది.

  • భారత్‌ టార్గెట్‌ 204

ఆక్లాండ్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. కోలిన్‌ మన్రో(59: 42బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), కేన్‌ విలియమ్సన్‌(51 :26 4ఫోర్లు, 4సిక్సర్లు), రాస్‌ టేలర్‌(54 నాటౌట్‌: 27 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది.ఆరంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించిన  కివీస్‌ను.. ఆఖర్లో భారత్‌ కట్టడి చేసింది. ఓపెనర్లు గప్తిల్‌, మన్రో,  తమదైన శైలిలో వేగంగా ఆడటంతో తొలి ఐదు ఓవర్లలోనే కివీస్‌ 50కి పైగా పరుగులు రాబట్టింది. మొదట్లో కివీస్‌ జోరు చూస్తే అలవోకగా 230కి పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. బౌండరీ చిన్నగా ఉండటంతో ఆతిథ్య‌ ఆటగాళ్లు అనువైన మైదానంలో వీరవిహారం చేశారు. 

చెల‌రేగిన ఆ ముగ్గురు..

కీలక సమయంలో శివమ్‌ దూబే.. గప్తిల్‌(30)ను ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. శివమ్‌ దూబే బౌలింగ్‌లో  గప్తిల్‌ భారీ షాట్‌ ఆడగా బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ అద్భుత క్యాచ్‌తో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. అనంతరం మన్రో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్ధశతకం సాధించిన తర్వాత  శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 12వ ఓవర్లో మన్రో.. చాహల్‌ చేతికి చిక్కాడు.   స్వల్ప వ్యవధిలోనే మన్రో,గ్రాండ్‌హోం వికెట్లను చేజార్చుకున్న  కివీస్‌ను  విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆఖర్లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మెరుపు బ్యాటింగ్‌తో విజృంభించడంతో 200 పరుగుల మార్క్‌ను చేరుకుంది.

తేలిపోయిన బౌలర్లు..

సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ పూర్తిగా తేలిపోయాడు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం కట్టడి చేయలేకపోయాడు. తాను వేసిన మూడో ఓవర్లో ఏకంగా 22 రన్స్‌ సమర్పించుకున్నాడు. మొత్తం నాలుగు ఓవర్లలో వికెట్‌ లేకుండా 53 పరుగులు ఇచ్చుకున్నాడు. యువ బౌలర్‌ శార్దుల్‌ 3 ఓవర్లు వేసి వికెట్‌ తీసి 44 పరుగులు సమర్పించుకున్నాడు.  స్పీడ్‌స్టర్‌ బుమ్రా, స్పిన్నర్‌ చాహల్‌ ధాటిగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. బుమ్రా, శార్దుల్‌, చాహల్‌, దూబే, జడేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు.  


logo