బుధవారం 08 జూలై 2020
Sports - May 11, 2020 , 19:24:56

‘ఆ ఆటగాడి రికార్డు బ్రేక్ చేయాలనుకోలేదు’

‘ఆ ఆటగాడి రికార్డు బ్రేక్ చేయాలనుకోలేదు’

లాహోర్​: పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన జాబితాలో మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్​(329) రెండో స్థానంలో ఉండగా.. హనీఫ్ మహమ్మద్​(337, వెస్టిండీస్​పై 1958లో) అతడి కంటే ముందున్నాడు. అయితే ఓసారి అవకాశమొచ్చినా తాను ఆ రికార్డు బద్దలుకొట్టేందుకు ప్రయత్నించలేదని, జట్టు ప్రయోజనం కోసం ఆడానని ఇంజమామ్ తాజాగా వెల్లడించాడు. 2002లో లాహోర్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన టెస్టులో ఇంజి 329పరుగులు చేశాడు. ఆ మ్యాచ్​లో మరో ఎండ్​లో వికెట్లు పడుతుండగా.. చివరికి ఇంజి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హనీఫ్ స్కోరుకు 8పరుగుల దూరంలోనే ఔటయ్యాడు. ఆ విషయంపై ఇంజమామ్ ఓ యూట్యూబ్​ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మాట్లాడాడు.

“9వికెట్లు చేజారాక నేను భారీషాట్లు ఆడడం ప్రారంభించా. ఆ క్రమంలోనే బౌండరీ దగ్గర క్యాచ్​కు ఔటయ్యా. మరో ఎండ్​లో టేలెండర్ కాకుండా బ్యాట్స్​మన్ ఉండిఉంటే ఇంకా కాసేపు ఆడి ఉండేవాడిని. అయితే హనీఫ్ రికార్డు బ్రేక్​ చేయాలని నేను అసలు అనుకోలేదు. ఒకవేళ అది ప్రపంచ రికార్డు అయిఉంటే ఆలోచించి ఉండేవాడినేమో. పాకిస్థాన్​ ఆటగాడి రికార్డును బ్రేక్ చేయడం నన్ను ఆకర్షించలేదు” అని ఇంజమామ్ చెప్పాడు. పాక్ తరఫున ఇంజమామ్ మొత్తం 120టెస్టులు, 378వన్డేలు, ఓ టీ20 ఆడాడు.


logo