మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 00:18:21

ఇక బ్యాట్స్‌మెన్‌ వంతు..

ఇక బ్యాట్స్‌మెన్‌ వంతు..

తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న బౌలర్లు.. మరో అద్భుత ప్రదర్శనతో మెల్‌బోర్న్‌ టెస్టులో మెరుగైన అవకాశాలు సృష్టించారు. కంగారూలకు కళ్లెం వేసి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇక బ్యాట్స్‌మెన్‌ కూడా అదే బాటలో మెరుగైన స్కోరు సాధిస్తే.. సిరీస్‌ సమం చేసే సువర్ణ అవకాశం టీమ్‌ఇండియాకు లభించినట్లే!

టెస్టు చరిత్రలోనే తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి డీలాపడ్డ టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో కంగారూలకు కనీస పోటీ ఇవ్వగలుగుతుందా అనే అనుమానాల మధ్య మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన రహానే సేన అదరగొట్టింది. సీనియర్లు అందుబాటులో లేకున్నా.. ఏమాత్రం తడబడకుండా విజృంభించింది. టాస్‌ ఓడటంతోనే మ్యాచ్‌ కూడా పోతుందేమోనని భయపడ్డా.. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తొలి రోజే భారత్‌ను ఒక మెట్టు ఎక్కించారు. ఆసీస్‌ గడ్డపై అపార అనుభవం ఉన్న ఇషాంత్‌, షమీ గైర్హాజరీలో.. అందుబాటులో ఉన్న వనరులను రహానే వాడుకున్న తీరుకు హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. పేస్‌ పిచ్‌పై పదకొండో ఓవర్‌లోనే అశ్విన్‌కు బంతినిచ్చి ఫలితం రాబట్టిన జింక్స్‌.. అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న సిరాజ్‌కు తొలి సెషన్‌లో ఒక్క ఓవర్‌ కూడా ఇవ్వలేదు. ఒత్తిడి పూర్తిగా తగ్గాక రెండో సెషన్‌లో అతడిని బరిలో దింపి శెభాష్‌ అనిపించుకున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో కేవలం ఫీల్డింగ్‌కే పరిమితమయ్యే అశ్విన్‌.. శనివారం ఆటలో తరచూ బౌలర్లకు సలహాలిస్తూ ఉత్సాహపరచడంతో పాటు ప్రమాదకర స్మిత్‌ను డకౌట్‌ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఇక పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తనకు అలవాటైన శైలిలో రెచ్చిపోవడంతో తొలి రోజు ఆటలో టీమ్‌ఇండియా ఆధిపత్యం కొనసాగింది. అడిలైడ్‌ టెస్టుతో పోలిస్తే ఫీల్డర్లు కూడా మెరుగవడం భారత్‌కు కలిసొచ్చింది.

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఆదివారం తొలి సెషన్‌లో ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని మనవాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. బౌలర్ల సమిష్టి కృషితో ప్రత్యర్థిని 200 మార్క్‌ చేరకుండానే కట్టడి చేయగా.. బ్యాట్స్‌మెన్‌ కూడా పోరాడితే మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశం లభిస్తుంది. కాస్త ఓపికగా ఆడితే ఈ పిచ్‌పై పరుగులు చేయడం పెద్ద కష్టం కాదని లబుషేన్‌, వేడ్‌, హెడ్‌ నిరూపించారు. ఆదివారం మనవాళ్లు 90 ఓవర్లపాటు క్రీజులో నిలిస్తే ఆధిక్యం దక్కడం ఖాయమే. తొలి టెస్టు ఆడుతున్న గిల్‌ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. చివరి సెషన్‌లో అలరించిన గిల్‌ అదే సంయమనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. పుజారా, రహానే, విహారి టెస్టు ఇన్నింగ్స్‌లకు పంత్‌, జడేజా మెరుపులు తోడవ్వాలని ఆశిద్దాం!


logo