సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , T01:15

భారత్‌లో కామన్వెల్త్‌ షూటింగ్‌, ఆర్చరీ చాంపియన్‌షిప్‌లు

 భారత్‌లో కామన్వెల్త్‌ షూటింగ్‌, ఆర్చరీ చాంపియన్‌షిప్‌లు
  • బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో చేరనున్న పతకాలు

లండన్‌: కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్‌)పై పోరాటంలో భారత్‌ అతిపెద్ద విజయం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా  మన దేశం చేసిన ఒత్తిడికి సీజీఎఫ్‌ దిగొచ్చింది. భారత్‌ వేదికగా కామన్వెల్త్‌ షూటింగ్‌, ఆర్చరీ చాంపియన్‌షిప్‌లను 2022 జనవరిలో నిర్వహిస్తామని సీజీఎఫ్‌ సోమవారం ప్రకటించింది. ఈ ఈవెంట్లు చండీగఢ్‌లో జరుగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌ల పతకాలను బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలకు చేర్చి.. పతకాల తుదిజాబితా వెల్లడించనున్నట్టు సీజీఎఫ్‌ తెలిపింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ఇక్కడ జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు సీజీఎఫ్‌ వెల్లడించింది. 


logo