గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 15:41:40

ఇషాంత్ శర్మకు గాయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్

ఇషాంత్ శర్మకు గాయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్

అబుదాబి : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అదేవిధంగా ఇషాంత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తమ తొలి మ్యాచ్ పంజాబ్ తో ఇషాంత్ శర్మ ఆడేది అనుమానంగానే ఉన్నది.

ఐపీఎల్ 2020 రెండో మ్యాచ్ ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరుగనున్నది. ఇరుజట్లు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎంతో అనుభవజ్ఞుడైన బౌలర్ ఇషాంత్ శర్మ గాయంతో బాధపడుతున్నాడు. ఇషాంత్ శర్మ ఇటీవలి కాలంలో చాలాసార్లు గాయపడ్డాడు. ఈ ఏడాది జనవరిలో చీలమండ గాయంతో బాధపడ్డాడు. నెల రోజుల తరువాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు తిరిగి వచ్చి మళ్ళీ గాయపడ్డాడు. ప్రస్తుతం చీలమండ గాయంతో పాటు వెన్నునొప్పితో ఇషాంత్ బాధపడుతున్నారు. గత ఐపీఎల్ లో 7.58 ఎకానమితో 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఇషాంత్ గాయం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ లకు తలనొప్పి కలిగించింది. ఇన్షాంత్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో హర్షల్ పటేల్, మోహిత్ శర్మ, అవేష్ ఖాన్ ఉన్నారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ లేకపోవడంతో ఈ ముగ్గురిలో ఒకరు ఆడటానికి అవకాశం లభిస్తుంది. ఇషాంత్ లేకపోవడంతో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడాపై ఒత్తిడి పెరుగుతుంది. గత సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు ఏడు సంవత్సరాల తరువాత ప్లే-ఆఫ్ కు చేరుకుంది. ఈసారి పంజాబ్‌కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నారు. పంజాబ్ జట్టు ఎప్పుడూ కాగితంపై బలంగా కనబడుతుంది. కానీ రెండు సందర్భాలలో తప్ప ఎప్పుడూ మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది టోర్నమెంట్‌ను గెలవడానికి ఇరు జట్లు దృష్టి సారించాయి.