మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 22:02:02

జూన్‌ 10 నుంచి బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ షురూ

జూన్‌ 10 నుంచి బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ షురూ

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లకు భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) వచ్చే నెల 10వ తేదీ నుంచి శిక్షణ శిబిరాలను పునఃప్రారంభించనుంది.  అన్ని ముందు జాగ్రత్త చర్యలు, మార్గదర్శకాల ప్రకారం పురుషులు, మహిళా బాక్సర్లకు పాటియాలాలో ఒకేచోట ట్రైనింగ్‌ ఇవ్వనుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాక బీఎఫ్‌ఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ఓ అధికారి వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌లో బీఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్కే సచేతి, ఉపాధ్యక్షుడు రాజేశ్‌ బండారి, హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్లు శాంటిగో నీవా, రఫేలే బెర్గామాస్కో, జాతీయ చీఫ్‌ కోచ్‌లు సీఏ కరియప్ప(పురుషులు), మహమ్మద్‌ అలీ ఖమర్‌(మహిళలు) పాల్గొన్నారు. కాగా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటి వరకు తొమ్మిది మంది భారత బాక్సర్లు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో అమిత్‌ పంగాల్‌(52కేజీలు), మనీశ్‌ కౌశిక్‌(63కేజీలు), వికాస్‌ కృష్ణన్‌(69కేజీలు), ఆశిష్‌ కుమార్‌(75కేజీలు), సతీశ్‌ కుమార్‌(91+కేజీలు) మహిళల విభాగంలో మేరీకోమ్‌(51కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌(60కేజీలు), లవ్లీనా బోర్గోహైన్‌(69కేజీలు), పూజా రాణి(75కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు.  


logo